దేవరగట్టు పేరు వినగానే కర్రల సమరం గుర్తుకు వస్తుంది. దశాబ్దాల కాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయాలకు ఇది నిదర్శనం. ఎంతో ఆసక్తి కరంగా సాగే దేవరగట్టు బన్ని ఉత్సవాలు జరిగితీరుతాయని భక్తులు అంటున్నారు. మాల్లమల్లేశ్వరుడి బన్నీ ఉత్సవం ఆపడం ఎవరి తరం కాదంటూ సవాలు విసురుతున్నారు. మరో వైపు ఈ నెల 5 అర్ధరాత్రి జరిగే బన్నీ(కర్రల సమరం ) పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అయితే భక్తుల సంప్రదాయం నెగ్గుతుందా.. లేక ప్రభుత్వ అదేశాలు అమలు అవుతాయా. ? అనే అంశం ఆసక్తికరంగా మారింది.
కర్రల సమరం వెనుక కథ..
కర్నూలు జిల్లా హోలగొంద మండలం దేవరగట్టు కర్రల సమరానికి ప్రసిద్ధి. ఈ ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతంలో ఋషులు,తపస్సు చేస్తూ ప్రశాంత జీవనం గడిపేవారు. అదే ప్రాంతంలో మని, మల్లాసురులు అనే రాక్షసులు కూడా నివాసముంటూ లోక కల్యాణం కోసం మునులు చేసే యాగాలు, పూజ కార్యక్రమాలకు భంగం కలిగిస్తూ ఉండేవారు. వారి వికృత చేష్టలు భరించలేక ఋషులు బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారట. మిమ్మల్ని రక్షించాలంటే విష్ణుమూర్తి వల్లే అవుతుందని బ్రహ్మదేవుడు సూచించగా మునులు వైకుంఠానికి వెళ్లి శరణు,, శరణు విష్ణు దేవా అంటూ వెళ్లి వేడుకున్నారు. మని మల్లసురులు శివుని భక్తులని వారిని సంహరించడం తన వాళ్ళ కాదని మీరు పరమేశ్వరుడి వద్దకు వెళ్లాలని విష్ణుమూర్తి సూచించడం తో కైలాసం వెళ్లి రాక్షసుల బారి నుంచి తమను కాపాడాలని వేడుకున్నారు.
దీంతో పరమేశ్వరుడు మనిమల్లాసురులను అంతమొందిస్తానని వారికి హామీ ఇచ్చాడని. హామీ ఇచ్చిన విధంగా పరమేశ్వరుడు కాల భైరవుడి అవతారంలో దేవరగట్టు కొండల్లో యుద్ధం సాగిస్తాడు. మని అనే రాక్షసుడిని అంతమొందిస్తాడు. ప్రాణాలు విడిచే సమయంలో తన చివరి కోరికను తీర్చాలని వేడుకుంటాడు. ఉత్సవాలకు వచ్చే కొందరు భక్తులను ఆహారంగా బలి ఇవ్వాలని కోరగా అందుకు పరమ శివుడు అంగీకరించి తథాస్తు అని చెప్పే సమయంలో పార్వతి దేవి అడ్డు చెప్పింది. మీరు కోరిన వరం తప్పు అని భక్తులను బలి ఇవ్వడం కుదరదని వేరే వరం కోరుకోవాలని కోరింది. భక్తుల నుంచి ప్రతి ఏటా కుండ నిండా రక్తం సమర్పించాలని మనిమల్లాసురులు కోరగా అందుకు పార్వతి దేవి అంగీకరించి ప్రతి ఏటా జరిగే దేవరగట్టు ఉత్సవాల్లో తన భక్తుల నుంచి పిడికెడు రక్తాన్ని ఇచ్చేలా వరం ఇచ్చింది. దీంతో అక్కడే రాక్షసులు ప్రాణాలు వదిలినట్లు చరిత్ర చెబుతోంది.
ఆ పిడికెడు రక్తం ఇచ్చేందుకు ప్రతి ఏటా రక్ష పడి వద్దకు వచ్చే భక్తులను గొరవయ్యలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో భక్తులు మాళమ్మ విగ్రహాన్ని తీసుకొని వెళ్లి పూజారి దబ్బనంతో తొడ నుంచి పిడికెడు రక్తం సమర్పిస్తారు. వెంటనే బండారు పూసి డిర్రు గో పరక్ అంటూ కేకలు వేస్తూ బన్నీ జైత్ర యాత్రలో జరిగే కర్రల సమరంలో కర్రల తో కొట్టుకోవడం, తలలు పగిలి రక్తం చిందిచడం తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయంగా భావిస్తున్నారు. యుద్ధం జరిగే సమయంలో వెళ్తున్న పరమేశ్వరుడికి ముళ్ళు గుచ్చుకొని ముళ్ల బండ సేద దీరిన ప్రాంతాన్ని ముళ్ల బండ గా పిలుస్తారు. ఆ ప్రాంతంలో స్వామి వారి పాదాలను ఉంచే ప్రాంతాన్ని పాదాల కట్టగా పిలుస్తారు.
అక్కడ నుంచి షమీ వృక్షం వద్ద స్వామి వారు సేదదీరి ఉదయం వేకువ జాము వరకు ఎదురు బసవన్న గుడి వద్దకు వెళ్లి మంచి చెడులు,పంటల ధరలను స్వామి వారు భవిష్యవాణి వినిపించారని ఇదే భవిష్యవాణి ఇప్పటికి కొనసాగుతుందని భక్తులు చెబుతున్నారు. అక్కడి నుంచి సింహాసనం కట్ట వద్దకు చేరుకొని కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వడంతో జైత్రయాత్ర ముగుస్తుంది. బన్ని ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి కొండల్లో వచ్చే భక్తులకు చీకటి అయ్యేదని ఆసమయంలో జంతువులు దాడి చేయకుండా ఉండేందుకు చేతిలో కర్ర,వెలుగు కోసం దివిటీలు చేతబూని ఉత్సవాలకు హాజరవుతారని చెబుతారు.
800 అడుగుల ఎత్తులో కొలువు దీరిన పార్వతి,పరమేశ్వరులను దర్శించుకునేందుకు అర్థరాత్రి నెరనికి,నెరనికి తాండ, కొత్తపేట,ఎల్లార్తి గ్రామాల ప్రజలు పాల బాస చేసి ఘర్షణలు లేకుండా కలసికట్టుగా ఉత్సవాలను విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశాక గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కర్రలు ,అగ్ని కాగడాలు చేత బూని శివ,పార్వతుల కల్యాణం జరిపించి అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకిలో సింహాసనం కట్ట వద్దకు చేరుస్తారు. అప్పుడే బన్నీ కర్రల సమరం హోరాహోరీగా జరుగుతుంది.ఉత్సవ మూర్తులను తమ గ్రామానికే దక్కాలంటూ మూడు గ్రామాల భక్తులు కర్రలతో శబ్దం చేస్తూ పోటీ పడటం ఆక్రమంలో తలలు పగలడం ,వెంటనే బండారు పూసుకుని అలాగే బన్నీలో పాల్గొనడం విశేషం. అయితే, కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత కక్షలకు కూడా దీనిని వేదికగా మార్చుకుంటున్నారు.
Read Also: Devaragattu Bunny Festival: దేవరగట్టు కర్రల సమరానికి అంతా సిద్ధం