టాలీవుడ్‌లో మరో వారసుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రానికి ‘మంగళవారం’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా కథా నేపథ్యం తిరుపతి పుణ్యక్షేత్రం చుట్టూ తిరుగుతుందని సమాచారం. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు స్వయంభుగా వెలసిన తిరుమల కొండల నేపథ్యంలో జరిగిన ఒక యదార్థ లేదా వైవిధ్యమైన సంఘటన ఆధారంగా అజయ్ భూపతి ఈ కథను సిద్ధం చేశారట. సినిమాలో ఎమోషనల్ డ్రామాతో పాటు కొత్త తరహా యాక్షన్ కూడా ఉండబోతుందని టాక్. కథ విన్నప్పుడే ఘట్టమనేని అభిమానులు ఈసారి ఒక సాలిడ్ వారసుడు రాబోతున్నాడని ఫిక్స్ అయిపోయారు.
Also Read : Kriti Sanon : బాక్సాఫీస్ నంబర్లు కాదు..పాత్రలే ముఖ్యం
కాగా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం తిరుపతిలో ప్రత్యేకమైన సెట్లను ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ అనంతరం, జయకృష్ణపై ఒక గ్రాండ్ సాంగ్ షూట్ చేయబోతున్నారట. ఈ పాట కోసం కూడా మేకర్స్ ఎక్కడ వెనకాడకుండా భారీ సెట్టింగ్స్ వేయిస్తున్నారు. ఒక కొత్త హీరో పరిచయ చిత్రానికి ఉండాల్సిన అన్ని హంగులను అజయ్ భూపతి సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే, సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెకు కూడా ఇది తెలుగులో మొదటి సినిమా కావడంతో ఈ జంటపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చందమామ కథలు పిక్చర్స్ పతాకంపై జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నా ఈ మూవీతో జయకృష్ణ.. తాత కృష్ణ, బాబాయ్ మహేష్ బాబుల వారసత్వాన్ని ఏ రేంజ్‌లో ముందుకు తీసుకెళ్తారో చూడాలి!