బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కృతి సనన్. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన సత్తా చాటుతోంది. ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి నటించిన ‘తేరే ఇష్క్ మే’ చిత్రంతో ఆమె ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో ముక్తి అనే పాత్రలో కృతి అద్భుతమైన నటనను కనబరిచి, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కృతి తన కెరీర్ మరియు పోటీ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది..
Also Read : Surya : మూడు భాషలు.. ముగ్గురు దర్శకులు.. సూర్య సౌత్ స్కెచ్ మాములుగా లేదుగా
‘మన పనిని పదిమంది మెచ్చుకున్నప్పుడు వచ్చే ఆనందం, శక్తి మరెక్కడా దొరకదని కృతి పేర్కొంది. ‘తేరే ఇష్క్ మే’ సినిమాకి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, ఒక నటిగా తనకు ఇంతలా ప్రేమ దక్కుతుందని ఊహించలేదని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో రేసు గురించి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నేను ఎవరితోనూ పోటీ పడటం లేదు. బాక్సాఫీస్ నంబర్ల కోసం పరుగు తీయడం కంటే, నా పనిని నేను ఆస్వాదించడానికే ప్రాధాన్యత ఇస్తున్నాను. కెరీర్‌లో ఒక స్థాయికి చేరుకున్నాక మన ప్రతిభ ఏంటో ప్రేక్షకులకు అర్థమవుతుందనే నమ్మకం నాకుంది’ అని స్పష్టం చేసింది. తాను ప్రస్తుతం ఉన్న స్థితితో సంతృప్తి చెందకుండా, వృత్తిపరంగా తనని తాను ఇంకా మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నట్లు కృతి వెల్లడించింది. మొత్తానికి గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కూడా బాక్సాఫీస్ లెక్కల కంటే నటనకే పెద్దపీట వేయడం కృతి సనన్ పరిణతిని చూపిస్తుంది. ఈ వైఖరి ఆమెను భవిష్యత్తులో మరిన్ని గొప్ప పాత్రల వైపు నడిపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.