Airtel Recharge Plan: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ మరోసారి తన వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్ అందించింది. నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ 57 శాతం పెంచేసింది. 28 రోజుల మొబైల్ ఫోన్ సర్వీస్ ప్లాన్‌ను రూ.99 నుంచి ఏకంగా రూ.155కి పెంచినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఎయిర్‌టెల్ వినియోగదారులు అపరిమిత కాలింగ్, ప్రతిరోజూ 1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్‌లు కావాలంటే రూ.155 చెల్లించాల్సి ఉంటుంది. తొలుత ట్రయల్ ప్లాన్‌గా అందుబాటులోకి తెచ్చిన ఎయిర్‌టెల్ త్వరలో దేశవ్యాప్తంగా విడుదల చేయనుంది. ప్రస్తుతం హర్యానా, ఒడిశాలకు పరిమితమైన ఈ కొత్త ప్లాన్‌ను మిగిలిన ప్రదేశాల్లో కూడా అమలు చేయనుందనే ఆందోళన ఎయిర్‌టెల్ యూజర్లను ఆందోళన పరుస్తోంది.
Read Also: Virginity Test: అప్పగింతల్లో గొడవ.. వధువుకి వర్జినిటీ టెస్ట్.. చివరికి ఏమైందంటే?
కాగా రూ.99 ప్లాన్ కింద ఇప్పటివరకు ఎయిర్‌టెల్ ప్రతిరోజు 200 ఎంబీ డేటా, సెకనుకు 2.5 పైసలుతో కాల్స్ అందించేది. మరోవైపు 28 రోజుల వ్యాలిడిటీతో ఉన్న డేటా, ఎస్ఎంఎస్ ప్లాన్‌లను ఎయిర్‌టెల్ రద్దు చేసే యోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అటు 2021లో రూ.79 కనీస రీఛార్జ్ ప్లాన్‌ను రద్దు చేసిన ఎయిర్‌టెల్ దాని స్థానంలో రూ.99 ప్లాన్ తీసుకువచ్చింది. ఇప్పుడు రూ.99 ప్లాన్‌ను ఉపసంహరించుకుని దాని స్థానంలో రూ.155 ప్లాన్‌ను తెచ్చిందంటూ బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల 30 రోజుల వ్యాలిడిటీతో రూ. 199 ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్ అందుబాటులోకి తెచ్చింది. 3 జీబీ డేటా పరిమితితో అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లను ఈ ప్లాన్ కింద యూజర్లు పొందవచ్చు. అంతేకాకుండా టెల్కో ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్, ఉచిత హలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా ఎయిర్‌టెల్ అందిస్తోంది.