Pakistan reaction Agni 5: భారతదేశం అగ్ని-5 క్షిపణిని పరీక్షించడం ద్వారా ప్రపంచానికి తన శక్తిసామర్థ్యాలను చూపించినట్లు అయ్యింది. పలువురు విశ్లేషకులు.. అగ్ని 5 మంటలు పాకిస్థాన్‌లో చెలరేగాయని అభిప్రాయపడ్డారు. దాయాది దేశం ఇండియా శక్తిని చూసి విషం కక్కుతోంది. అదే సమయంలో చర్చల కోసం విజ్ఞప్తి చేస్తోంది. భారత్ పరీక్షించిన అగ్ని 5 క్షిపణి ప్రాంతీయ, ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ముప్పు అని పాక్ నేతలు ప్రకటనలు ఇస్తున్నారు.. తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ పాక్ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశం ఆయుధ నిల్వ, క్షిపణి పరీక్ష పాక్ భద్రతకు ప్రమాదకరమే కాకుండా, మొత్తం ప్రపంచ స్థిరత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అన్నారు. అంతర్జాతీయ సమాజం ఇండియా సైనిక అభివృద్ధిని విస్మరిస్తోందని, అగ్ని-5 వంటి ఖండాంతర క్షిపణులను భారత్ పరీక్షించడం పెరుగుతున్న సైనిక ముప్పును చూపిస్తుందని ఆరోపించారు.
READ ALSO: Dharmasthala case: సంచలన ‘ధర్మస్థల’లో అంతా తూచ్.. కంప్లైంట్ చేసిన వ్యక్తి అరెస్ట్..
చర్చలకు విజ్ఞప్తి చేస్తున్న పాక్..
పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. షఫ్కత్ అలీ ఖాన్‌కు విభిన్నంగా స్పందించారు. జూలైలో ఆయన ఇస్లామాబాద్‌లోని పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. కాశ్మీర్‌తో సహా అన్ని అంశాలపై భారతదేశంతో మాట్లాడటానికి పాక్ సిద్ధంగా ఉందని అన్నారు. ‘ మేము కాశ్మీర్ మాత్రమే కాకుండా అన్ని అంశాలపై చర్చలు కోరుకుంటున్నాము. వాణిజ్యం నుంచి ఉగ్రవాదం వరకు ప్రతి రంగంలో భారతదేశంతో సహకరించడానికి తమ దేశం సిద్ధంగా ఉంది’ అని చెప్పారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె), ఉగ్రవాదం సమస్య పరిష్కారమైన తర్వాతే దాయాదితో చర్చలు జరుపుతామని భారతదేశం స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని సమర్ధించే దేశాలతో ఇండియా చర్చలు జరపదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో వెల్లడించారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు సైనిక గౌరవాలు ఇస్తుందని, ఉగ్రవాద భాష.. భయం, రక్తం, ద్వేషంతో కూడుకున్నదే తప్ప చర్చల భాష కాదని ఆయన అన్నారు.
ఈ రెండు దేశాలు చైనాలో కలుస్తాయా..?
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇండియా సింధు జలాలను పాక్‌కు నిలిపివేసింది. సింధు జల ఒప్పందాన్ని తిరిగి అమలు చేయాలని పాక్ భారత్‌ను డిమాండ్ చేస్తుంది. ఈ ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మరణించారు. భారతదేశం దీనికి ప్రతిస్పందనగా మే 7న ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించి… పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. తాజాగా పాక్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. క్రీడలు, రాజకీయాలను వేరుగా ఉంచాలని, క్రికెట్ వంటి క్రీడలు రెండు దేశాల మధ్య ప్రభావితం కాకూడదని అన్నారు. షాంఘై సహకార సంస్థ సమావేశంలో కూడా భారత్-పాక్ మధ్య ఎటువంటి సమావేశం ఉండదని తెలిపారు.
READ ALSO: Noida dowry murder: నాన్నే అమ్మను లైటర్‌తో కాల్చి చంపాడు… నోయిడాలో దారుణం