Afghanistan Rejects Pakistan Delegation: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఇప్పుడిప్పుడే కాస్త శాంతించాయి. తాజాగా పాక్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అధికారిక పర్యటన కోసం చేసిన అభ్యర్థనలను ఆఫ్ఘనిస్తాన్ పదే పదే తిరస్కరించింది. ఒకరకంగా చెప్పాలంటే ఛీకొట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే గత మూడు రోజులుగా దాయాది రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్, ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మాలిక్, మరో ఇద్దరు పాక్ జనరల్స్ మూడు వేర్వేరు వీసా అభ్యర్థనలను ఆఫ్ఘనిస్థాన్‌కు సమర్పించారు. కానీ ఈ అభ్యర్థనలను కాబూల్ తిరస్కరించింది. ఎందుకో తెలుసా..
READ ALSO: AP Power Staff JAC: విద్యుత్ ఉద్యోగుల చర్చలు విఫలం.. ఎల్లుండి నుంచి సమ్మె..
వీసా అభ్యర్థనల తిరస్కరణలకు కారణాలు తెలుసా..
ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ (IEA).. పాకిస్థాన్ ఇటీవల చేసిన గగనతల ఉల్లంఘనలను, పాక్టికా ప్రావిన్స్‌లోని పౌర ప్రాంతాలపై వైమానిక దాడుల కారణంగా వారి అధికారిక పర్యటనకు వీసా అభ్యర్థనలు తిరస్కరించినట్లు ఉదహరించింది. కాబుల్ పర్యటనకు రావడానికి ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ప్రతినిధి బృందంలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అసిమ్ మాలిక్, ఇద్దరు సీనియర్ పాక్ జనరల్స్ ఉన్నారు. ఈ నలుగురు సభ్యులు మాత్రమే వీసా అభ్యర్థనలు సమర్పించారని పలు నివేదికలు తెలిపాయి.
పాకిస్థాన్ ఇటీవల పౌర ప్రాంతాలపై వైమానిక దాడులు, పాక్టికా ప్రావిన్స్‌లో గగనతల ఉల్లంఘనలను ఉటంకిస్తూ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ (IEA).. దాయాది ప్రతినిధుల బృందానికి దేశంలో పర్యటించడానికి వీసాను ఆమోదించడానికి నిరాకరించినట్లు పేర్కొంది. “మా పౌరులు దాడికి గురైనప్పుడు ఏ ప్రతినిధి బృందం కూడా కాబూల్‌కు వస్తుందని ఆశించలేము” అని కాబూల్ అధికారులు తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ నిర్ణయం కేవలం దౌత్యపరమైన అవమానం మాత్రమే కాదని, ఆఫ్ఘన్ తన నిబంధనలపై పాక్‌తో చర్చలు జరపదని ఇది స్పష్టమైన సందేశాన్ని పంపుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్ఘన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనేది కాబూల్ ఉద్దేశం అని ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు. పాక్ అభ్యర్థనను కాబూల్ తిరస్కరించడం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో పెరుగుతున్న ఉద్రిక్తతలను సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.