Allu Arjun: రీల్ లైఫ్ హీరోలందరూ నిజ జీవితంలో కూడా హీరోలు కాలేరు కానీ సౌత్ ఇండియన్ యాక్టర్ అల్లు అర్జున్ అలాంటి వ్యక్తి అని నిరూపించుకున్నాడు. అల్లు అర్జున్ రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా తన మంచి మనసు చాటుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కష్టకాలంలో ఉన్న ఎంతో మందికి ఆర్థిక సహాయం అందించారు. తన అభిమానులకు ఏ చిన్న కష్టం వచ్చినా స్వయంగా వెళ్లి మరీ సహాయం చేస్తుంటారు. కొవిడ్ వేవ్ సమయంలో కూడా అల్లు అర్జున్ ఎంతోమందిని ఆదుకున్నాడు. తాజాగా అల్లు అర్జున్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. మన రాష్ట్రం కాకపోయినా చదువు విలువ తెలిసిన వ్యక్తిగా కేరళాలో ఓ నర్సింగ్ విద్యార్థిని చదువుకు అయ్యే ఖర్చు భరించడమే కాదు.. ఆమెను దత్తత తీసుకున్నాడు. ‘పుష్ప’ నటుడు తన నర్సింగ్ చదువును కొనసాగించడానికి మార్గం కోసం కష్టపడుతున్న కేరళ విద్యార్థికి సహాయం అందించాడు. అన్ని ఖర్చులను భరించడం ద్వారా నాలుగేళ్ల కోర్సును స్పాన్సర్ చేస్తానని ఆమెకు హామీ ఇచ్చారు.
ఇటీవల వరదల కారణంగా కేరళలోని ఎన్నోగ్రామాలు కొట్టుకుపోయాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా అలెప్పీ అనే ప్రాంతం పూర్తిగా నేలమట్టం అయ్యింది. అప్పటి అలెప్పీ సబ్ కలెక్టర్, ప్రస్తుత జిల్లా కలెక్టర్ మైలవరపు కృష్ణతేజ ‘ఐయామ్ ఫర్ అలెప్పీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరద సహాయం నుంచి పునరవాసం, ఉపాధి కల్పన, ఇళ్ల నిర్మాణం లాంటి అనేక కార్యక్రమాలను ఆ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, యాంకర్ సుమ, రాజమౌళి బాహుబలి బృందం ఇలా అనేక మంది తెలుగు రాష్ట్రాల ప్రముఖులు తమ వంతు సహాయం అందించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా కొవిడ్ సమయంలో మరణించిన తల్లితండ్రుల పిల్లలను ఆదుకునేందుకు ‘వీ ఆర్ ఫర్ అలెప్పీ’ అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌గా కృష్ణతేజ చేపట్టారు. కొవిడ్ కారణంగా ప్రపంచమంతా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కొవిడ్ కష్టాలతో ఎంతో మంది తమ కుటుంబ పెద్దలను కోల్పోయి అనాథలుగా మిగిలారు. కొవిడ్ కారణంగా తమ తండ్రిని కోల్పోయిన ఓ విద్యార్థిని నర్సింగ్ చదువుకోవడానికి డబ్బు కావాల్సి వచ్చింది. ఆ విద్యార్థినికి మెరిట్ ర్యాంకు వచ్చినా ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఉంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ కృష్ణతేజ ‘వీ ఆర్ ఫర్ అలెప్పీ’లో ఆమెకు సాయం అందించాలని భావించారు.
Virat Kohli: భారమైన హృదయంతో ఆస్ట్రేలియాను వీడుతున్నాం.. కోహ్లీ ఉద్వేగభరిత ట్వీట్
ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కృష్ణతేజ.. అల్లు అర్జున్‌ను ఆ విద్యార్థినికి ఒక సంవత్సరం ఫీజు చెల్సిస్తే బాగుంటుందని కోరారు. ఆ విద్యార్థిని పరిస్థితి తెలుసుకున్న అల్లు అర్జున్ ఒక సంవత్సరం కాదు.. నాలుగు సంవత్సరాలు తనకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని.. ఆమెను తాను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం. అలప్పీ జిల్లా కలెక్టర్ వీఆర్ కృష్ణ తేజ తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా అల్లు అర్జున్ గొప్ప మనస్సు గురించి తెలియజేశారు.తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో, విద్యార్థిని, ముస్లిం యువతి తన చదువు కొనసాగించడానికి సహాయం కోరుతూ తనను కలవడానికి ఎలా వచ్చిందో కలెక్టర్ వివరించారు. ఆమె ప్లస్ టూ పరీక్షలలో 92 శాతం మార్కులు సాధించినప్పటికీ, గత సంవత్సరం ఆమె తండ్రి కోవిడ్ -19 తో మరణించడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె తన చదువును కొనసాగించలేకపోయింది. సహాయం కోరుతూ టాలీవుడ్ సూపర్ స్టార్ అల్లు అర్జున్‌ని సంప్రదించానని, అందుకు ఆయన వెంటనే అంగీకరించారని చెప్పారు. దీనికి అన్ని విధాలా సహకరించిన అల్లు అర్జున్, కళాశాల అధికారులు, ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు జిల్లా కలెక్టర్ కృష్ణతేజ. అల్లు అర్జున్ మంచి మనసు తెలుసుకున్న కేరళ ఫ్యాన్స్ ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.