NTV Telugu Site icon

Justin Trudeau: కెనడాలో ఖలిస్తాన్ తీవ్రవాదంపై జస్టిన్ ట్రూడో కీలక వ్యాఖ్యలు

Justin Trudeau

Justin Trudeau

Justin Trudeau: ఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన సమావేశంలో తాను, ప్రధాని నరేంద్ర మోడీ ఖలిస్తానీ తీవ్రవాదం, విదేశీ జోక్యం గురించి చర్చించుకున్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం తెలిపారు. ట్రూడో వ్యాఖ్యలు కెనడాలో ఖలిస్తానీ కార్యకలాపాలు పెరగడం, తీవ్రవాద అంశాల పట్ల ఆ దేశం మెతక వైఖరికి వ్యతిరేకంగా వచ్చాయి. కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోను ఖలిస్తాన్ తీవ్రవాదం, విదేశీ జోక్యం గురించి ప్రశ్నించగా.. ఈ రోజు తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సంవత్సరాలుగా పోరాడుతున్న రెండు అంశాలపై చర్చించానని చెప్పారు.

Also Read: Chandrababu: చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్

ఖలిస్తానీ నిరసనల గురించి మాట్లాడుతూ.. కెనడా ఎల్లప్పుడూ భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ, శాంతియుత నిరసన స్వేచ్ఛను కాపాడుతుందని, అవి ఆ దేశానికి చాలా ముఖ్యమైనవని అన్నారు. అయినప్పటికీ హింసను నిరోధించడానికి, ద్వేషానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. కొద్ది మంది చేసే చర్యలు మొత్తం సమాజానికి లేదా కెనడాకు ప్రాతినిధ్యం వహించవని గుర్తుంచుకోవాలన్నారు. చట్టాన్ని గౌరవించడం ప్రాముఖ్యత గురించి ప్రధాని మోడీ చర్చించామన్నారు. బ్రిటీష్ కొలంబియాలోని కెనడాలోని సర్రే పట్టణంలోని శ్రీ మాతా భామేశ్వరి దుర్గా దేవాలయం వెలుపలి గోడలపై భారతదేశ వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల గ్రాఫిటీతో అపవిత్రం చేయబడిన కొన్ని రోజుల తర్వాత ట్రూడో ప్రకటన రావడం గమనార్హం.

Also Read: Israel: “ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్”.. ఇజ్రాయిల్ ప్రధాని ప్రశంసలు..

ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌ వేదికగా జస్టిన్‌ ట్రూడోతో భేటీపై స్పందించారు. వివిధ రంగాలలో పూర్తి స్థాయి ఇండియా-కెనడా సంబంధాల గురించి చర్చించామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జులైలో, భారత ప్రభుత్వం ఢిల్లీలోని కెనడా రాయబారిని పిలిపించి, కెనడాలో ఖలిస్తానీ అనుకూల గ్రూపుల ఉనికి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారిక దౌత్య సందేశాన్ని అందజేసింది. ఆ సమయంలో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. కెనడా టెర్రరిజంపై స్థిరంగా పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని, అలా చేయడంలో తన నిబద్ధతను కొనసాగిస్తుందని చెప్పారు. ఖలిస్తాన్ మద్దతుదారులు, దేశంలోని ఉగ్రవాదుల పట్ల తమ ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తుందని భావించడం సరికాదని ఆయన ఉద్ఘాటించారు.