Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. న్యాయమూర్తి బెంచ్ మీదికి వచ్చిన తర్వాత కోర్టు హాలు నుంచి అందరినీ బయటకు పంపించారు. 30 మంది మాత్రమే ఉండాలని ఆదేశించారు. ఆ తర్వాత తీర్పును చదివారు. సిఐడి తరఫు న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ఈనెల 22 వరకు చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. చంద్రబాబును కాసేపట్లో రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. ఆయనను తరలించే ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సెంట్రల్ జైలు వద్ద సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. అంతేకాకుండా రాజమండ్రిలో 36 చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు.
Read Also: Prakash Raj: ప్రకాష్ రాజ్ నిరసన సెగ.. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలే కారణం..
ఈ కేసులో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వాదనలు ముగిశాయి. అయితే అప్పటి నుంచి కోర్టు తీర్పు కోసం దాదాపు సాయంత్రం 7 గంటల వరకు వేచి చూడాల్సి వచ్చింది. సుమారు 8 గంటల పాటు సుదీర్ఘ వాదనలు సాగాయి. కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత తుది ఫలితం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. మరోవైపు జ్యూడిషియల్ రిమాండును హౌస్ అరెస్టుగా మార్చాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. రేపు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. అయితే అక్కడ బాబుకు ఊరట దక్కుతుందో లేదో చూడాలి. ఈ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే.. చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరుత్సాహంలో ఉన్నారు.