ACB Rides: ట్రాన్స్‌పోర్ట్ శాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ అక్రమ ఆస్తుల కేసులో చిక్కుకున్నారు. శ్రీనివాస్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలపై ఏసీబీ అధికారులు హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, జగిత్యాల, ఇతర ప్రాంతాల్లోని శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, జగిత్యాల సహా మొత్తం 8 ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో పుప్పాల శ్రీనివాస్ పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు రూ. 50 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
Also Read: SA20 2025: ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లిన సన్‌రైజర్స్
ఏసీబీ సోదాల్లో ఏమేం బయటపడ్డాయన్నా విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో ఉన్న విలాసవంతమైన ఇల్లు.. జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో భూములు, వరంగల్‌లో ఉన్న భారీ స్థలాలు, బ్యాంకు అకౌంట్లలో నగదు నిల్వలు, బంగారం, విలువైన ఆభరణాలు బయట పడ్డాయి. పుప్పాల శ్రీనివాస్‌పై గత కొంతకాలంగా ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ప్రస్తుతం ఆస్తుల విలువను అంచనా వేసే పనిలో అధికారులు ఉన్నారు. ఈ దాడుల అనంతరం పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు డీటీసీ పుప్పాల శ్రీనివాస్ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఆధారాలు సమీకరించి, మరింత లోతుగా దర్యాప్తు జరపనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేసేవారు అవినీతి ఊబిలో కూరుకుపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.