IND vs ZIM: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ-20లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 234 పరుగులు చేసింది. జింబాబ్వే ఎదుట 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌కు మంచి ఆరంభమేమీ లభించలేదు. రెండో ఓవర్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. దీని తర్వాత అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ సిక్సర్లు, ఫోర్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన అభిషేక్ శర్మ.. రెండో టీ-20 మ్యాచ్‌లో అభిషేక్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సెంచరీ సాధించాడు.
Read Also: IND vs ZIM: జింబాబ్వేతో రెండో టీ-20.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
తన రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లో అభిషేక్ 46 బంతుల్లో సెంచరీ సాధించాడు. అర్థశతకం దాటిన తర్వాత సెంచరీని చేరుకోవడానికి 13 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. అభిషేక్ శర్మ మూడు బంతుల్లో మూడు సిక్సులు బాది సెంచరీ పూర్తి చేసుకోగా.. సెంచరీ చేయగానే మరో బంతికి సిక్సర్ బాదేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. అభిషేక్ శర్మ 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేశాడు. అనంతరం రుతురాజ్ గైక్వాడ్(77), రింకూ సింగ్(48)లు కూడా అద్భుతంగా ఆడడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. రింకూ సింగ్ 22 బంతుల్లోనే 48 పరుగులు చేయడం గమనార్హం. భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 234 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో మసకద్జ, ముజరబాని తలో వికెట్ సాధించారు.