టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాజీ బిజినెస్ పార్టనర్ మిహిర్ దివాకర్ అరెస్ట్ అయ్యాడు. ధోనీ క్రిమినల్ కేసు నమోదు అనంతరం పోలీసులు అతడిని జైపుర్‌లో అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా తన పేరును క్రికెట్ అకాడమీల కోసం వాడుకొన్నారని రాంచీ జిల్లా కోర్టులో మూడు నెలల క్రితం దివాకర్‌తో పాటు సౌమ్యా దాస్‌పై ధోనీ ఫిర్యాదు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు జైపుర్‌లో దివాకర్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సౌమ్యా దాస్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయడానికి 2017లో ఎంఎస్ ధోనీతో మిహిర్ దివాకర్‌కు చెందిన ‘ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్’ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం ఫ్రాంఛైజీ ఫీజులు, లాభాల్లోని వాటాను మహీకి ఆర్కా స్పోర్ట్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆర్కా స్పోర్ట్స్.. మహీకి డబ్బు చెల్లించడంలో విఫలమైంది. ఈ విషయంపై మిహిర్ దివాకర్, సౌమ్య దాస్‌తో ధోనీ పలుమార్లు చర్చించినా… ఫలితం లేకపోయింది. దాంతో ఆ ఒప్పందం నుంచి ధోనీ వైదొలిగాడు.
Also Read: Hardik Pandya: 4.3 కోట్ల రూపాయలు మోసపోయిన పాండ్యా సోదరులు!
2021 ఆగస్టు 15న ఆర్కా స్పోర్ట్స్‌కు ఇచ్చిన అథారిటీ లెటర్‌ను కూడా ఎంఎస్ ధోనీ రద్దు చేసుకున్నాడు. ఆపై లీగల్ నోటీసులు కూడా పంపించారు. మిహిర్ దివాకర్, సౌమ్య దాస్‌ల నుంచి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ధోనీ కోర్టును ఆశ్రయించాడు. రాంచీ కోర్టులో ఇద్దరిపై క్రిమినల్ కేసు దాఖలు చేశాడు. ఆర్కా స్పోర్ట్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించిమా కారణంగా ధోనీకి రూ.15 కోట్ల నష్టం వాటిల్లినట్లు మహీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు దివాకర్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. సౌమ్యా దాస్ ఆచూకీ ఇంకా తెలియరాలేదు.