NTV Telugu Site icon

Delhi Mayor Polls: మేయర్ పీఠం కోసం కొట్లాట.. తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా

Delhi Mayor

Delhi Mayor

Delhi Mayor Polls: ఢిల్లీ మేయర్ పీఠం కోసం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ సమావేశంలో భారీ గందరగోళం చెలరేగింది. ఈరోజు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో రెండు వర్గాల మధ్య రసాభాస జరిగింది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. ఎంసీడీకి జరిగిన ఎన్నికల్లో ఆప్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటమిపాలైనప్పటికీ మేయర్‌ పదవికి బీజేపీ పోటీ పడుతోంది. మేయర్ తామే దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆప్‌ తరపున షెల్లీ ఒబెరాయ్‌ పోటీపడుతుండగా, బీజేపీ నుంచి రేఖా గుప్తా బరిలో నిలిచారు. బ్యాకప్ అభ్యర్థిగా అషు థాకూర్‌ను ఆప్‌ నిలబెట్టనుంది. డిప్యూటీ మేయర్‌ పోస్ట్‌ కోసం ఆప్‌ నుంచి ఆలె ముహమ్మద్‌ ఇక్బాల్‌, జలాజ్‌ కుమార్‌లు, బీజేపీ నుంచి కమల్‌ బార్గీలు పోటీలో ఉన్నారు. పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. 250 స్థానాలు ఉన్న ఎంసీడీలో.. 134 ఆప్‌, బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస్‌ 9 స్థానాలు గెలుపొందింది. తొలుత ఓటమి కారణంతో మేయర్‌ పదవికి పోటీ చేయమని బీజేపీ ప్రకటించింది. కొన్ని పరిణామాలతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ పోటీలోకి బీజేపీ దిగింది.

సివిక్ సెంటర్ మధ్యలో ఆప్, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. విజువల్స్‌లో, సభ్యులు ఒకరినొకరు నెట్టడం, కొందరు నేలమీద పడటం కనిపించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన తాత్కాలిక స్పీకర్ సత్య శర్మ నామినేటెడ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం ప్రారంభించినప్పుడు నిరసనలు చెలరేగాయి. ఎన్నికైన కౌన్సిలర్లు నామినేటెడ్ సభ్యుల కంటే ముందే ప్రమాణం చేసి ఉండాలని ఆప్ సభ్యులు తెలిపారు. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే లెఫ్టినెంట్ గవర్నర్ అనేక అపాయింట్‌మెంట్లు చేశారని, మేయర్ ఎన్నికలను బీజేపీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆప్ ఆరోపించింది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఉద్దేశపూర్వకంగా బీజేపీతో పొత్తుపెట్టుకున్న 10 మంది నామినేటెడ్ సభ్యులను ఎంపిక చేశారని ఆరోపించారు.

Cold Wave: గజగజ వణికిస్తున్న చలి.. ఢిల్లీలో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

నామినేటెడ్ సభ్యుల పేర్లను పేర్కొన్న తర్వాత, సక్సేనా మేయర్ ఎన్నికకు అధ్యక్షత వహించడానికి తాత్కాలిక స్పీకర్‌గా బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మను కూడా నియమించారు. సీనియర్ మోస్ట్ కౌన్సిలర్ అయిన ముఖేష్ గోయల్‌ను ఆ పదవికి ఆప్ సిఫార్సు చేసింది. మూడు పర్యాయాలు అధికారం చేపట్టిన తర్వాత జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ మేయర్‌ పదవిని తామే కైవసం చేసుకుంటామని ప్రకటించింది. “సభలో అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్ లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా నామినేట్ చేయడం సంప్రదాయం. కానీ బీజేపీ అన్ని ప్రజాస్వామ్య సంప్రదాయాలు, సంస్థలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది” అని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు.

ఢిల్లీ మేయర్‌ పదవి.. ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్‌ చేశారు. రెండో ఏడాది ఓపెన్‌ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్‌ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్‌ కేటగిరీ కింద మేయర్‌ అభ్యర్థిని ఎన్నుకుంటారు.

Show comments