టీమిండియా స్టార్ క్రికెటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కోహ్లీకి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత మాజీ క్రికెటర్లు కింగ్ కోహ్లీకి తమ విషెస్‌ను తెలిపారు. చిన్నప్పటి కోహ్లీ.. ఇప్పుడు క్రికెట్ దిగ్గజంగా మారడంపై మాజీ క్రికెటర్ కమ్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. తండ్రి మరణించినా స్వదేశంలో జరిగిన ఓ మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన క్షణాన్ని గుర్తు చేశాడు.
‘ఆ రోజు ఈ కుర్రాడు ఇంకేం అవుతాడో అనిపించింది. 2006లో ఓ చిన్న పిల్లాడు, ఇప్పుడు క్రికెట్ దిగ్గజంగా మారాడు. ఒకే ఒక్కడు కింగ్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు. 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో విరాట్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 19 ఏళ్ల వయసులో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో గౌతమ్ గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 12 పరుగులు చేశాడు. గత ఒకటిన్నర దశాబ్దాలుగా విరాట్ తన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు 118 టెస్టుల్లో, 295 వన్డేల్లో, 125 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ తరఫున ఆడాడు.
Also Read: AUS vs IND: కోహ్లీ, రోహిత్ భవితవ్యం మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది: గవాస్కర్
‘హ్యాపీ బర్త్‌డే విరాట్ కోహ్లీ. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ క్రికెటర్‌గా ఎదిగావు. ఎన్నో ఆటుపోట్లను చవిచూశావు. నీ అద్భుత ఫామ్‌ను మళ్లీ చూస్తామని అనుకుంటున్నా. నువ్ తప్పకుండా కమ్‌బ్యాక్ ఇస్తావ్. గతంలోనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నావ్. గాడ్ బ్లెస్ యూ విరాట్’ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. ‘హ్యాపీ బర్త్‌డే విరాట్. యువ క్రికెటర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. అత్యుత్తమ ప్లేయర్‌గా మారడం అద్భుతం. కొత్తగా క్రికెట్‌లోకి వచ్చే యువతకు స్ఫూర్తిగా నిలిచావ్. ‘పెద్ద కలలు కనాలి, వాటిని నిజం చేసుకొనేందుకు కష్టపడాలి’ ఇవే నువ్వు నమ్మి పాటిస్తున్న సూత్రాలు’ అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.