Amit Shah: అంతర్జాతీయంగా భారతదేశ గౌరవాన్ని పెంచడమే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కొత్త భారతదేశం రూపుదిద్దుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం అన్నారు. జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని ‘తిరంగ ఉత్సవ్’లో ప్రసంగించిన అమిత్ షా.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, సోషల్ మీడియాలో ప్రొఫైల్ పిక్చర్‌గా అప్‌లోడ్ చేయడం ద్వారా ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నవ భారత కల నెరవేరబోతోందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు గౌరవంగా చూస్తోందన్నారు. 2014-2022 మధ్య ప్రధాని మోదీ ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టను పెంచారని తెలిపారు. భారతదేశం ఇలా గౌరవించబడడం కోసం లక్షలాది మంది ప్రజలు తమ జీవితాలను త్యాగం చేశారని హోంమంత్రి అన్నారు.స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని, చరిత్రలో గర్వించదగిన దేశాన్ని, తన భవిష్యత్తును తానే సృష్టించుకునే దేశాన్ని చూడడానికి వారు తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అలాంటి నవ భారతాన్ని నిర్మిస్తున్నారని ఆయన అన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని, సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో త్రివర్ణ పతాకాన్ని అప్‌లోడ్ చేయాలని మోడీ పిలుపునిచ్చారని షా చెప్పారు.
Breaking News : టీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. రాజీనామాకు సిద్ధమైన ఎర్రబెల్లి సోదరుడు
దేశ సైనికులకు అమరవీరులకు గౌరవం ఇవ్వడానికి ఇంతకంటే మంచి మార్గం లేదని అమిత్ షా వెల్లడించారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకునేందుకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్నట్లు హోంమంత్రి తెలిపారు. స్వాతంత్ర్య సమరంలో ఎందరో అమరవీరులు ప్రాణాలు కోల్పోయారని.. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశ విజయగాథలను దేశంలోని ప్రతి ఒక్కరికి వద్దకు తీసుకెళ్లడం, భారత ప్రజాస్వామ్య విజయాన్ని ప్రపంచంలోని ప్రతి భాగానికి వ్యాప్తి చేయడం తమ మరో లక్ష్యమని షా అన్నారు. ప్రతి భారతీయుడి సమిష్టి కృషితో 2047 నాటికి భారతదేశాన్ని ‘విశ్వ గురువు’గా మార్చడమే మూడో లక్ష్యం అని అన్నారు. దేశ జాతీయ జెండా రూపకర్త వెంకయ్యకు హోంమంత్రి ఘనంగా నివాళులర్పించారు.1916 లో వెంకయ్య భారతదేశ జెండాను తయారు చేయగల 30 డిజైన్లను అందించే పుస్తకాన్ని ప్రచురించారు.1921లో విజయవాడ కాంగ్రెస్‌లో మహాత్మా గాంధీ జాతీయ జెండా కోసం ఈ డిజైన్‌లలో ఒకదానిని చివరకు ఆమోదించారు.