Lucky Draw: ఒక్క బిర్యానీ తిని ఏడు లక్షల రూపాయల కారు గెలుచుకున్నాడు ఓ లక్కీ ఫెలో. తిరుపతి నగరంలోని రోబో హోటల్లో నిర్వహించిన బిర్యాని లక్కీ డ్రా లో రాహుల్ అనే వ్యక్తి నిస్సాన్ మాగ్నట్ కారు ఉచితంగా పొందాడు. గత సెప్టెంబర్ నెలలో రోబో హోటల్ వినూత్న స్కీం ప్రవేశపెట్టింది. హోటల్ లో బిర్యాని తిన్న ప్రతి ఒక్కరికి కూపన్ అందజేసింది. సుమారు 23 వేలకు పైగా కూపన్లు చేరాయి. నూతన ఏడాదిని పురస్కరించుకొని ఆదివారం రాత్రి హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి, నీలిమ దంపతులు హోటల్ ఆవరణలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో కూపన్ వెలికి తీశారు.
తిరుపతికి చెందిన రాహుల్ విజేతగా నిలిచారు. ఆయనకు నిస్సాన్ మ్యాగ్నెట్ కారు ఉచితంగా లభించింది. హోటల్ అధినేతలు స్వయంగా రాహుల్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ కు కారును అందజేశారు. ఈ సందర్భంగా రోబో హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నగర వాసులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో ఈ వినూత్న స్కీం ప్రవేశపెట్టామన్నారు. తక్కువ ధరలకు నాణ్యమైన వంటకాలు రోబో హోటల్లో అందిస్తున్నామని ఇలాంటి వినూత్న స్కీములు ఇకపై మరిన్ని కొనసాగిస్తామని భరత్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు.