Camera Found in MRI Centre: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని మాల్వియా నగర్‌లో ఉన్న ఓ ఎంఆర్‌ఐ సెంటర్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో మొబైల్ కెమెరా ద్వారా వీడియోలు తీసిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. జహంగీరాబాద్‌కు చెందిన ఒక యువకుడు తన భార్యను పరీక్షల నిమిత్తం మాల్వియా నగర్ ఎంఆర్‌ఐ సెంటర్‌కు తీసుకెళ్లాడు. పరీక్షకు ముందు, సిబ్బంది ఆమెను గౌను ధరించి దుస్తులు మార్చుకునే గదిలోకి పంపించారు. మహిళ గౌను ధరించేటప్పుడు, మహిళకు ఫాల్స్ సీలింగ్ పైన కెమెరా లాంటి ఒక వస్తువు కనిపించింది. దానితో ఆమె భర్త అనుమానంతో ఆ కెమెరా వైపు చూసి, గమనిస్తే అది రికార్డింగ్ మోడ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ అని తెలిసింది. వారు దానిని గుర్తించే సమయానికి మొబైల్ ఫోన్‌లో అప్పటికే 27 నిమిషాల వీడియో రికార్డయింది.
Also Read: Champions Trophy 2025: హైబ్రిడ్ మోడల్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ.. 2027వరకు తటస్థ వేదికలే!
దీనిపై ఆగ్రహించిన భర్త, సెంటర్ సిబ్బందిని ప్రశ్నించగా, వారు దురుసుగా ప్రవర్తిస్తూ మొబైల్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎలాగోలా భార్యాభర్తలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి, దుస్తులు మార్చుకునే గదిని సీల్ చేసి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. సదరు మొబైల్‌లో అనేక అసభ్యకర వీడియోలు ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. విశాల్ ఠాకూర్ (23) అనే ఉద్యోగి ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు గుర్తించారు. అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఉద్యోగిని నియమించేటప్పుడు ఎలాంటి పోలీస్ వెరిఫికేషన్ చేయలేదని అరేరా హిల్స్ పోలీస్ స్టేషన్ టీఐ మనోజ్ పట్వా తెలిపారు. పోలీసులు ప్రస్తుతానికి విశాల్ తీసిన వీడియోలను ఎక్కడైనా షేర్ చేశాడా, లేక దుర్వినియోగం చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Delhi: దేశ రాజధానిలో ఏడాది పాటు బాణాసంచా కాల్చడం నిషేధం
ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురి చేసింది. మహిళల భద్రత, గోప్యతపై ప్రజలు ప్రశ్నలు వేస్తున్నారు. ఈ ఘటనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు, అధికారులను కోరుతున్నారు. ఈ ఘటన ఎంఆర్‌ఐ సెంటర్‌లలో భద్రతా ప్రమాణాల లేమిని బయటపెట్టింది. దుస్తులు మార్చుకునే గదుల్లో కెమెరాలు అమర్చడం తీవ్ర నేరం. ఇటువంటి ఘటనలపై ప్రజలందరూ సున్నితంగా స్పందించి, బాధితులకు న్యాయం చేకూర్చేందుకు సహకరించాలి.