Jagityal : ప్రస్తుతం అంతా మనీ మామ. డబ్బు మోహంలో పడి కుటుంబ బంధాలను కాలరాస్తున్నారు. అలాంటిదే జగిత్యాలలో జరిగింది. కేవలం రెండు వందల కోసం తండ్రీ కొడుకును దారుణంగా హత్య చేశాడు. సింగరేణి సంస్థలో పనిచేసే భూమయ్య తన ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు. ఉద్యోగం చేసే సమయంలో కుటుంబంతో కలిసి గోదావరిఖనిలో నివాసముండేవాడు. రిటైర్ అయిన తర్వాత తన భార్య రాజమ్మ, కొడుకు మహేష్ కుటుంబంతో కలిసి సొంత ఊరు రాంనూర్ లో జీవిస్తున్నాడు. అయితే తాగుడుకు బానిసైన కొడుకు మహేష్ జులాయిగా తిరుగుతూ తల్లిదండ్రులకు భారంగా మారాడు. ఆస్తి పంపకాల విషయంలో భూమయ్య, అతడి కొడుకుకు మధ్య గొడవ రాజుకుంది. ఈ వివాదం చివరకు కన్న కొడుకును తండ్రి దారుణంగా కొట్టిచంపే స్థాయికి దారితీసింది. ఈ గొడవ గత సోమవారమే జరిగింది.
Read Also: Theft in Own House : సొంతింటికే కన్నం వేశాడు.. కారం చల్లి కప్పి పుచ్చాలనుకున్నాడు.. కానీ
రూ.200 ఇవ్వాలని మహేష్ తండ్రి భూమయ్యను అడగ్గా అందుకు అతడు నిరాకరించాడు. దీంతో మహేష్ తండ్రితో గొడవకు దిగగా సహనం కోల్పోయిన భూమయ్యలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వ్యవసాయ భూమిని కౌలు చేసే శేఖర్ తో కలిసి కొడుకును భూమయ్య అతి దారుణంగా కొట్టాడు. దీంతో కాళ్లు, చేతులు విరిగి రక్తపుమడుగులో పడిపోయిన మహేష్ ను కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలించారు. మొదట జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స అందించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహేష్ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు భూమయ్య, శేఖర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేవలం రెండు వందల కోసం కొడుకును తండ్రి చంపిన ఈ ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది.