సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చేవెళ్ల నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎనిమిది మంది కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అందెల శ్రీరాములు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన కార్పొరేటర్లు వీరే.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 2వ డివిజన్ కార్పొరేటర్ గౌరీ శంకర్, 12వ డివిజన్ కార్పొరేటర్ రవినాయక్, 31వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మీ రాజు, 44వ డివిజన్ కార్పొరేటర్ జ్యోతి కిషోర్ ఉండగా.. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన 32వ డివిజన్ కార్పొరేటర్ వేముల నర్సింహా, 36వ డివిజన్ కార్పొరేటర్ మల్లేష్ ముదిరాజ్, 28వ డివిజన్ కార్పొరేటర్ అరుణా ప్రభాకర్ రెడ్డితో పాటు కో- ఆప్షన్ మెంబర్ ఎల్లమ్మ ఉన్నారు.
Read Also: Raashii Khanna: ట్రెండీ అందాలతో మెరిసిపోతున్న రాశి ఖన్నా…
ఈ సందర్భంగా చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. నరేంద్ర మోడీని మరోసారి దేశ ప్రధానిని కాకుండా ఎవ్వరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ విజన్, మోడీ నాయకత్వానికి ఆకర్షితులైన చాలా మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతున్నారని ఆయన అన్నారు. ఎనిమిది మంది కార్పొరేటర్ల చేరికతో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేరుతుందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో మీర్పేట్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు.. మన కొత్త పాలక వర్గం రాగానే కేంద్రం నుంచి వచ్చే ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసుకుందామని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.