అన్నదాతలు చేపట్టిన చలో ఢిల్లీ (Farmers Protest) కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. నిరసన దీక్షలో పాల్గొన్న ఓ రైతన్న అసువులు బాశాడు. శంభు సరిహద్దు దగ్గర ప్రాణాలు కోల్పోయాడు. దీంతో విషాదం చోటుచేసుకుంది.
79 ఏళ్ల జియాన్ సింగ్ (Gian Singh) చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే శంభు సరిహద్దు దగ్గర హఠాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సహచర రైతులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమంగా మారింది. అత్యవసర వార్డుకు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే జియాన్ సింగ్ మరణించాడని రాజేంద్ర ఆస్పత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హర్నామ్ సింగ్ తెలిపారు.
ఈ తెల్లవారుజామున 3 గంటలకు జియాన్ సింగ్‌కు అసౌకర్యంగా అనిపించడంతో రాజ్‌పురాలోని సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లామని.. అనంతరం అక్కడి నుంచి పాటియాలాలోని రాజేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు రైతులు తెలిపారు.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం అన్నదాతలు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. గత మంగళవారం నుంచి పంజాబ్-హర్యానా నుంచి పెద్ద ఎత్తున కర్షకులు హస్తినకు తరలివచ్చారు. ట్రాక్టర్లు, ఆయా వాహనాలతో ఢిల్లీకి బయల్దేరి వచ్చారు. మరోవైపు రైతులు సరిహద్దులు దాటకుండా భద్రతా బలగాలు తీవ్రంగా అడ్డుకుంటున్నాయి. ఇనుపకంచెలు, సిమెంట్ దిమ్మెలు, బారికేడ్లు, రోడ్డుపై మేకులు వేసి అడ్డుకుంటున్నారు. అంతేకాకుండా వారిపై భాష్పవాయువు కూడా ప్రయోగిస్తు్న్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. మరోవైపు రైతుల్ని కంట్రోల్ చేసేందుకు అత్యధికమైన సౌండ్‌తో ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీతో చెవులు దెబ్బతినడం.. అలాగే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.