BF-7 Covid Variant: పశ్చిమ బెంగాల్‌లో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఎఫ్-7 కలకలం సృష్టిస్తోంది. ఇటీవల నాలుగు కేసులు కనుగొనబడినట్లు ఆరోగ్య అధికారి బుధవారం తెలిపారు. ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చిన నలుగురు వ్యక్తులకు జీనోమ్ సీక్వెన్సింగ్‌లో వారికి కొత్త వైరస్ సోకినట్లు నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. నలుగురు రోగుల పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.
నలుగురిలో, ముగ్గురు నాడియా జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు. ఒకరు బీహార్‌కు చెందినవారు. కానీ ప్రస్తుతం కోల్‌కతాలో నివసిస్తున్నారని అధికారి పేర్కొన్నారు. ఈ నలుగురు వ్యక్తులతో కలిపి మొత్తం 33 మంది వ్యక్తులకు బీఎఫ్-7 బారినపడినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 33 మంది ఆరోగ్యంగా ఉన్నారని, వారి పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నామని ఆ అధికారి చెప్పారు.
గత నెల నుంచి కొవిడ్-19 పాజిటివ్ అని తేలిన విదేశాల నుండి కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తులందరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం సేకరించారు. గత వారం, కోల్‌కతా విమానాశ్రయంలో ఒక విదేశీ పౌరుడితో సహా ఇద్దరు వ్యక్తులకు కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో బీఎఫ్-7 సబ్‌వేరియంట్ సోకినట్లు నిర్ధారించారు.