Bus Accident: జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుల్వామా జిల్లాలో బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 28 మంది గాయపడ్డారు. బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పుల్వామా జిల్లాలోని బర్సూ ప్రాంతంలో శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగినట్లు వారు తెలిపారు. ఈ ప్రమాదంలో బీహార్‌కు చెందిన నలుగురు ప్రయాణికులు మరణించారు. 28 మంది ప్రయాణికులు గాయపడగా, వారిలో 23 మందిని చికిత్స నిమిత్తం ఇక్కడి వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Marriage: పెళ్లి కోసం వరుడి పాట్లు.. 28కి.మీ నడిచి వధువు ఇంటికి.. ఎందుకంటే?
బలగాలు, తీవ్రవాదుల మధ్య కాల్పులు..
ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఈరోజు కాల్పులు జరిగాయి. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామాలోని మిత్రిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారి తెలిపారు. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. కాల్పులు కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు ఇరువైపులా ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవని పోలీసులు తెలిపారు. తీవ్రవాదులను ఏరివేసే పనిలో సాయుధ బలగాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మిత్రిగామ్ సహా జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.