Tahawwur Rana: 26/11 ముంబై దాడిలో ప్రధాన సూత్రదారి తహవూర్ రాణాకు పెద్ద రిలీఫ్ లభించింది. ఈ నెలలో మూడుసార్లు ఆయన తన సోదరుడితో ఫోన్లో మాట్లాడటానికి ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ సంభాషణ జైలు అధికారుల సమక్షంలో జరుగుతుందని, ప్రతి కాల్ రికార్డ్ చేయబడుతుందని కోర్టు స్పష్టం చేసింది. అతను హిందీ లేదా ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడటానికి అనుమతి లభించింది. బుధవారం ప్రత్యేక న్యాయమూర్తి చందర్ జీత్ సింగ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
READ MORE: Raviteja: మాస్ జాతరతో లెక్కలు సరిచేయబోతున్న రవితేజ?
వర్చువల్ కోర్టుకు..
తహవూర్ రాణాను కోర్టులో వర్చువల్ హాజరుపరిచారు. వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి అతనికి మూడు ఫోన్ కాల్స్ చేయడానికి అనుమతించడంతో పాటు అతని జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 8 వరకు పొడిగించారు. కోర్టులో రాణాకు పలు సానుకూల అంశాలు లభించాయి. అతను తన ప్రైవేట్ న్యాయవాదితో చట్టపరమైన చర్చలు జరపడానికి, అతని సోదరుడితో ఫోన్లో మాట్లాడటానికి కోర్టు పర్మిషన్ లభించింది.
ముంబై ఉగ్రవాద దాడికి సంబంధించిన ఈ కేసు విచారణను క్లోజ్డ్ రూమ్‌లో నిర్వహించారు. ఫోన్ కాల్స్ దుర్వినియోగాన్ని సహించబోమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అదే సమయంలో తహవ్వూర్ రాణా తరఫు న్యాయవాది పియూష్ సన్దేవా ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్లో చేర్చబడిన కొన్ని పత్రాలను పరిశీలించడానికి కోర్టు నుంచి సమయం కోరారు. దానిని న్యాయమూర్తి అంగీకరించారు.
26/11 ముంబై దాడిలో జరిగిన ప్రమాదకరమైన కుట్రతో సంబంధం ఉన్న వ్యక్తి తహవ్వూర్ హుస్సేన్ రాణా. ఈ ఉగ్రవాద దాడికి ప్రధాన కుట్రదారుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ.. అలియాస్ దావూద్ గిలానీ. హెడ్లీ ఒక అమెరికన్ పౌరుడు. ఈ దాడి కుట్రలో తన పాత్రను అతను అంగీకరించాడు. తహవ్వూర్ రాణాను ఏప్రిల్ 4న భారతదేశానికి తీసుకువచ్చారు. గతంలో ఆయనను భారతదేశానికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన సమీక్ష పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2008 నవంబర్ 26న, 10 మంది పాకిస్థాన్ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి చొరబడ్డారు. ఈ ఉగ్రవాదులు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్, రెండు లగ్జరీ హెూటళ్లు, ఒక యూదు కేంద్రంపై వరుస దాడులు చేశారు. ఈ దాడి 60 గంటల పాటు కొనసాగింది.
ఈ ఉగ్రవాద దాడిలో 166 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ భయంకరమైన ఉగ్రవాద దాడి ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. పొరుగు దేశమైన పాకిస్థాన్ పేరు ఇందులో తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తహవ్వూర్ రాణా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.
READ MORE: Putin safe in Alaska: అలస్కాకు పుతిన్.. అక్కడ ఆయన సేఫేనా?