NTV Telugu Site icon

Boat Accident: విషాదం.. బీచ్‌ వద్ద పడవ బోల్తా.. 21 మంది దుర్మరణం

Boat Capsize

Boat Capsize

Boat Accident: పర్యాటకుల బృందంతో వెళ్తున్న పడవ మునిగిపోవడం వల్ల 21 మంది మరణించారు. ఈ విషాద ఘటన కేరళలో చోటుచేసుకుంది. కేరళలోని మలప్పురం జిల్లా తానూర్ ప్రాంతంలోని తువల్తిరం బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం 30 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న హౌస్‌బోట్ బోల్తా పడి మునిగిపోవడంతో మహిళలు, పిల్లలతో సహా కనీసం 21 మంది మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. వివిధ ఆసుపత్రుల నుంచి వచ్చిన సమాచారం మేరకు నీటిలో నుంచి బయటకు తీసిన వారిని, పడవలోపల చేర్చిన వారి సమాచారం మేరకు 21 మంది మరణించినట్లు నిర్ధారించినట్లు క్రీడా మంత్రి వి.అబ్దురహిమాన్ తెలిపారు.

పాఠశాలలకు సెలవులు కొనసాగుతుండగా.. చాలా మంది మహిళలు, పిల్లలు జాలీ ట్రిప్ కోసం వచ్చారని అబ్దురహిమాన్ తెలిపారు. “మరింత మంది బాధితులు పడవ కింద చిక్కుకున్నారని, వారిని బయటకు తీసుకురావాలని భావిస్తున్నారు. పడవ బోల్తా పడింది. దానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు దీనిపై విచారణ జరుపుతారు” అని ఆయన విలేకరులతో అన్నారు. పడవ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించి తగిన ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్.. ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.

Read Also: Chhattisgarh Blast : మందుపాతర పేలుళ్లకు కారణమైన నలుగురు అరెస్ట్.. అందులో ముగ్గురు మైనర్లే

ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రాణనష్టానికి సంతాపం తెలిపారు. మలప్పురం జిల్లా కలెక్టర్‌ను సమన్వయంతో అత్యవసర రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించాలని ఆదేశించారు. అగ్నిమాపక, పోలీసు విభాగాలు, రెవెన్యూ, ఆరోగ్య శాఖల అధికారులు, జిల్లాలోని తానూర్, తిరూర్ ప్రాంతాలకు చెందిన స్థానికులు సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారని ప్రకటనలో తెలిపారు. సహాయక చర్యలను మంత్రులు అబ్దురహిమాన్, రియాస్ సమన్వయం చేస్తారని కూడా పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.నీటిలో నుంచి బయటకు తీసిన వారిని సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ప్రస్తుతం తెలియరాలేదని పోలీసులు తెలిపారు.