ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ ‘జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ తన ఎలక్ట్రిక్ కారు ‘విండ్‌సోర్’ ధరలను పెంచింది. విండ్‌సోర్ అన్ని వేరియంట్‌లపై రూ.50 వేలు పెంచుతున్నట్లు కంపనీ ప్రకటించింది. అంతేకాదు ఫ్రీ ఛార్జింగ్ ప్రయోజనాలను కూడా నిలిపివేసింది. విండ్‌సోర్ లాంచ్ సమయంలో ప్రారంభ ధరను 10వేల యూనిట్లు వరకు లేదా డిసెంబర్ 31 వరకు మాత్రమే పరిమితం అని పేర్కొంది. యాదృచ్ఛికంగా విండ్‌సోర్ ఈవీ విక్రయాలు డిసెంబర్‌లోనే 10,000 యూనిట్ల విక్రయ మైలురాయిని చేరుకుంది. దాంతో ధరను కంపెనీ పెంచింది.
కాంప్లిమెంటరీ ఆఫర్ కింద ఎంజీ ఇ-హబ్ యాప్ ద్వారా ఛార్జింగ్ స్టేషన్లలో విండ్‌సోర్ ఈవీకి ఉచితంగా ఛార్జ్ చేసుకునే వెసులుబాటును ఎంజీ మోటార్ ఇండియా కల్పించింది. ఇకపై ఉచిత ఛార్జింగ్ ఆఫర్ కొత్త కస్టమర్లకు అందుబాటులో ఉండదు. విండ్‌సోర్ కారు కొనుగోలు చేసిన మొదటి యజమానికి ఈవీ బ్యాటరీపై లైఫ్‌టైమ్ ఉచిత వారెంటీ సదుపాయం ఉంది. మొదటి యజమానికి నుంచి కొనుగోలు చేసేవారికి 8 ఏళ్ల పాటు లేదా 160000 కిలోమీటర్ల వరకు వారెంటీని పరిమితం చేసింది.
లేటెస్ట్ రేట్స్ ప్రకారం.. విండ్‌సోర్ బేసిక్ వేరియంట్ ధర రూ.13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మిడ్-స్పెక్ ఎక్స్‌క్లూజివ్ ట్రిమ్ ధర రూ.14.99 లక్షలుగా.. టాప్-స్పెక్ ఎసెన్స్ వేరియంట్ రూ.15.99 లక్షలకు అందుబాటులో ఉంది. విండ్‌సోర్‌లో ఎకో, ఎకో ప్లస్, నార్మల్, స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఈవీలో 38 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఫుల్ ఛార్జింగ్‌పై సుమారు 331 కిమీ ప్రయాణం చేయొచ్చని కంపెనీ చెబుతోంది.