Chennakesava Reddy: ఫ్యాక్షనిజానికి హీరోయిజమ్ అద్దిన చిత్రాలలో కథానాయకునిగా నటించి అపూర్వమైన విజయాలను సొంతం చేసుకున్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. ఆయన నటించిన ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ ఆ తరహా చిత్రాలే! ఈ సినిమాల ఘనవిజయాన్ని చూసి ఇతర హీరోలు సైతం అదే పంథాలో పయనించారు. అలాంటి ఫ్యాక్షనిజమ్ నేపథ్యంలోనే బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రం తెరకెక్కింది. శ్రీసాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.వి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేశ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2002 సెప్టెంబర్ 25న ‘చెన్నకేశవరెడ్డి’ విడుదలై విజయం సాధించింది.
‘చెన్నకేశవ రెడ్డి’ కథ ఏమిటంటే – చెన్నకేశవ రెడ్డి ఊర్లో ఆయన శిలావిగ్రహం పెట్టి ప్రతీ యేటా పుట్టినరోజు వేడుకలు చేసి, పిల్లలకు స్వీట్స్ పంచుతూ ఉంటారు ఆయన సన్నిహితులు. ఆయన ఉన్నాడో లేడో అతని అనుయాయులకే తెలియదు. ఏదో ఒకరోజు వస్తారనే ఆశతో ఉంటారు. ముంబైలో భరత్ సిన్సియర్ పోలీసాఫీసర్. అతని పనితనం డిపార్ట్ మెంట్ లో అందరికీ నచ్చుతుంది. డి.ఐ.జి. ప్రసాద్ కూతురు ప్రీతి, భరత్ ను ప్రేమిస్తుంది. భరత్ లాగే ఓ సిన్సియర్ పోలీసాఫీసర్ అయిన శివకృష్ణను ధనంజయరెడ్డి మనుషులు తమకు అడ్డు తగులుతున్నాడని డీ ప్రమోట్ చేసి తీహార్ జైలుకు పంపిస్తారు. అక్కడే ఆయనకు జైలులో ఉన్న చెన్నకేశవరెడ్డి కనిపిస్తాడు. ఆయన శిక్షాకాలం పూర్తయినా, ఇంకా జైలులోనే ఎందుకు ఉన్నాడని ఆరాతీస్తాడు. దాని వెనుక వెంకటరెడ్డి కొడుకులు ధనంజయరెడ్డి, అతని సోదరులు ఉన్నారని తెలుస్తుంది. ఒకప్పుడు వెంకటరెడ్డి కొడుకు ఓ అమ్మాయిని గర్భవతిని చేసి ఎండ్రిన్ పోసి చంపేస్తాడు. వెంకటరెడ్డి ముందే అతని కొడుకును అలాగే చంపిస్తాడు చెన్నకేశవరెడ్డి. దాంతో పగబట్టిన వెంకటరెడ్డి, తన మిత్రుడైన చెన్నకేశవ రెడ్డి తండ్రిని బ్రతిమలాడి అతని కూతురును తన ఇంటికోడలుగా చేసుకుంటాడు. పెళ్ళిలోనే చెన్నకేశవరెడ్డి కన్నవారిని బంధుమిత్రులను చంపేస్తాడు వెంకటరెడ్డి. అది తెలిసిన చెన్నకేశవరెడ్డి వెంకటరెడ్డిని నరికేస్తాడు. అతని చెల్లెలు, ఆ ఇంటి కోడలుగా వెళ్తుంది. చెన్నకేశవ రెడ్డి భార్య, బిడ్డను ఆమె అన్న తీసుకొని ముంబై వెళతాడు. చెన్నకేశవ రెడ్డి కోసం జనం తరలి వస్తారు. అతడిని ఏమీ చేయలేమని భావించిన వెంకటరెడ్డి కొడుకులు, అతనికి జైలు శిక్ష పడేలా చేసి ఉంటారు. శివకృష్ణ చొరవతో పై అధికారులకు విషయం వివరించి, చెన్నకేశవ రెడ్డి విడుదలయ్యేలా చేస్తాడు. అతను వెంకటరెడ్డి కొడుకులను చంపుకుంటూ వస్తాడు. తన భార్య, కొడుకును కలుసుకుంటాడు చెన్నకేశవ రెడ్డి. అతడిని అరెస్ట్ చేయడానికి ముంబైలో ఉన్న భరత్ ను స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తారు. చెన్నకేశవరెడ్డిని అవమాన పరచిన తాళికట్టిన భర్తనే అతని చెల్లెలు నరికేస్తుంది. ఆమెను భరత్ అరెస్ట్ చేస్తాడు. చెన్నకేశవరెడ్డిని పట్టుకోవడానికి భరత్ తన తల్లి చనిపోయినట్టు పేపర్ లో ప్రకటిస్తాడు. భార్య చనిపోయిందని భావించిన చెన్నకేశవ రెడ్డి వస్తాడు. ఆ ఛేజింగ్ లో నిజంగానే చెన్నకేశవరెడ్డి భార్య గాయాల పాలై చనిపోతుంది. కొడుకు కోసం అరెస్ట్ అవుతాడు చెన్నకేశవ రెడ్డి. జైలులోనే అతడిని మట్టుపెట్టాలనిచూస్తాడు ధనంజయ్ రెడ్డి. జైలు నుండి వచ్చి పబ్లిక్ మీటింగ్ లోనే ధనంజయ్ రెడ్డిని చంపేస్తాడు చెన్నకేశవ రెడ్డి. ఆ సమయంలో అతని కొడుకు భరత్ కూడా సహకరిస్తాడు. దాంతో పొంగిపోతాడు చెన్నకేశవ రెడ్డి. తన పగను పంచుకున్నందుకు ఆనందిస్తాడు. పోలీస్ డ్రెస్ తీసేసి, జనం కోసం బతకమంటాడు. చెన్నకేశవ రెడ్డి జైలుకు వెళ్తూ మళ్ళీ వస్తానంటాడు. తండ్రి స్థానంలో భరత్ కొనసాగడంతో కథ ముగుస్తుంది.
బాలకృష్ణ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో టబు, శ్రియ, దేవయాని, శివకృష్ణ, జయప్రకాశ్ రెడ్డి, ఆనంద్ రాజ్, మోహన్ రాజ్, పృథ్వీ, దేవన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, వేణు మాధవ్, అన్నపూర్ణ, ఆహుతి ప్రసాద్, చలపతిరావు, వైజాగ్ ప్రసాద్, రఘుబాబు, నాగినీడు, పొన్నాంబళం, ఫిష్ వెంకట్, మాస్టర్ నందన్, మాస్టర్ జార్జిబాబు, మాస్టర్ గౌతమ్, బేబీ శ్రావ్య, బేబీ త్రిష, బేబీ సరయు ఇతర పాత్రధారులు.
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి. పరుచూరి బ్రదర్స్ రచన చేశారు. మణిశర్మ బాణీలు కట్టగా, వేటూరి, సీతారామశాస్త్రి, చంద్రబోస్, శ్రీనివాస్ పాటలు పలికించారు. ఇందులోని “నీ కొప్పులోన మల్లెతోట…”, “హాయి హాయి హాయే హాయి…”, “నవ్వే వాళ్ళు నవ్వనీ… డోంట్ కేర్…”, “బకరా బకరా…”, “ఊరంతా ఉత్సవం…”, “తెలుపు తెలుపు…” అంటూ సాగే పాటలు అలరించాయి.
ఇరవై ఏళ్ళ క్రితం తెలుగు చిత్రసీమలో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా ‘చెన్నకేశవ రెడ్డి’ నిలచింది. ఈ సినిమాకు ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ స్థాయి టాక్ రాలేదు. కానీ, ద్విపాత్రాభినయంతో బాలకృష్ణ ఆకట్టుకున్నారు. ఇందులోని కొన్ని సన్నివేశాలు అంతకు ముందు ఇదే సినిమా రచయితలు రాసిన వేరే ఫ్యాక్షన్ డ్రామాలోలాగే ఉండడం అభిమానులకు నిరాశ కలిగించింది. ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలని ఓ పాట చిత్రీకరణ మిగిలి ఉండగానే రిలీజ్ చేశారు. అది కూడా సినిమా టాక్ పై ప్రభావం చూపింది. సినిమా రిలీజ్ అయ్యాక “తెలుపు తెలుపు…” పాటను చిత్రీకరించి, తరువాత జత చేశారు. ఏది ఏమైనా బాలకృష్ణ అంతకు ముందు నటించిన ఫ్యాక్షన్ డ్రామాస్ స్థాయిలో ఇది అలరించలేక పోయింది. ఈ యేడాది జూన్ 10న బాలకృష్ణ బర్త్ డేకు ఈ సినిమాను అభిమానులు ప్రత్యేకంగా థియేటర్లలో ప్రదర్శించుకొని ఆనందించారు. ఈ చిత్రం ఇరవై ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 25న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తూ ఉండడం విశేషం! హీరోల పుట్టినరోజు సందర్భంలో కాకుండా, సినిమా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సమయంలో ఓ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడం ఇదే మొదటిసారి!
Karnataka: గంజాయి స్మగ్లర్ల దాడి.. చావుబతుకుల మధ్య పోలీస్ ఇన్‌స్పెక్టర్