Honour Killing: ఆమె వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనికి అది రెండో పెళ్లి. ఇది ఆమె కుటుంబానికి నచ్చలేదు. కోపంతో ఊగిపోయిన మహిళ మేనమామ.. ఆమె ఇంటికి వెళ్లాడు. మహిళను బయటకు ఈడ్చుకొచ్చి కొడవలితో గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆ 20 ఏళ్ల మహిళను హతమార్చాడు మేనమామ. పారిపోయి వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఓ వ్యక్తి శనివారం తన మేనకోడలిని ఆమె ఇంటి నుంచి బయటకు లాగి గొంతు కోశాడని పోలీసులు తెలిపారు. హత్యాయుధం కొడవలితో ఆ వ్యక్తి మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని వారు తెలిపారు. ఈ సంఘటన పిసావాన్ పోలీస్ సర్కిల్ పరిధిలోని బజ్‌నగర్ గ్రామంలో జరిగింది. 20 ఏళ్ల యువతికి గ్రామానికి చెందిన రూప్ చంద్ర మౌర్యతో సంబంధం ఉందని, పారిపోయి వివాహం చేసుకుందని సీతాపూర్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్పీ సింగ్ తెలిపారు.
పిసావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బజ్‌నగర్ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. సంబంధిత మహిళ గతంలో తన మేనమామ ఇంట్లో నివాసముండేది. కాగా అదే గ్రామానికి చెందిన రూప్ చంద్ర మౌర్యతో ఆమెకు కొన్నేళ్లుగా సంబంధం ఉంది. అయితే అతనికి అప్పటికే పెళ్లి జరిగింది. పైగా అతనిది వేరే కులం కాగా.. ఈ వ్యవహారం తెలుసుకున్న మేనమామ శ్యాము సింగ్, మహిళను మందలించి ఆమెను గతేడాది తన తండ్రి పుతాన్ సింగ్ తోమర్ వద్దకు పంపించేశాడు. మహిళ ఘజియాబాద్‌లో ఉంటోందని తెలుసుకున్న రూప్ చంద్ర మౌర్య కొన్ని రోజుల తర్వాత అక్కడికి వెళ్లాడు. వారిద్దరు కలిసి ప్లాన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. కొన్ని నెలలు గడిచాయి. మళ్లీ మౌర్య, మహిళ ఇటీవలే బజ్‌నగర్ గ్రామానికి వెళ్లి కాపురం మొదలుపెట్టారు. ఇది తెలుసుకున్న శ్యాము సింగ్ కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే శనివారం.. మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమెను ఇంటి బయటకు ఈడ్చుకొచ్చి, కొడవలితో గొంతు కోసి చంపేశాడు. మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Read Also: Wrestlers protest: నాపై ఒక్క లైంగిక ఆరోపణ రుజువైనా నేను ఉరేసుకుంటా.. బ్రిజ్ భూషన్ సంచలన వ్యాఖ్యలు
హత్య చేసిన ఆయుధంతో పాటు పిసావన్ పోలీస్ స్టేషన్లో శ్యామూ సింగ్ స్వయంగా లొంగిపోయాడని ఏఎస్పీ ఎన్పీ సింగ్ తెలిపారు. ఆమె పారిపోయి అప్పటికే వివాహమై వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లాడినందుకే ఆమెను హత్య చేశాడని ఏఎస్పీ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి శ్యాము సింగ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును తదితర కోణాల్లో నిశితంగా దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ తెలిపారు.