భాగ్యనగరంలో దోపిడీలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దుండగులు భారీగా బంగారం, నగదును దోచుకెళ్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఇటీవలి రోజుల్లో వరుస చోరీలతో జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా హిమాయత్ నగర్‌లో భారీ చోరీ జరిగింది. ఓ బంగారం వ్యాపారి ఇంట్లో భారీగా బంగారం, నగదు దోచుకెళ్లారు దొంగలు. వ్యాపారి లబోదిబోమంటూ హిమాయత్ నగర్ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలలం రేపింది.
వివరాల ప్రకారం.. హిమాయత్ నగర్‌లో నివాసం ఉండే బంగారం వ్యాపారి రోహిత్ కేడియా కూతురి పెళ్లి దుబాయ్‌లో జరిగింది. కూతురు పెళ్లి కోసం నాలుగు రోజుల క్రితం వ్యాపారి రోహిత్ దుబాయ్‌కు వెళ్లాడు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో భారీ చోరీ జరిగింది. రెండు కోట్ల రూపాయల నగలతో పాటు రూ.50 లక్షల నగదు చోరీకి గురైంది. వ్యాపారి వెంటనే హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.
వ్యాపారి రోహిత్ కేడియా దుబాయ్‌కు వెళ్లే ముందు ఇంట్లో పని చేసే 20 మందికి ఓ రూమ్ ఇచ్చాడు. ఈ నెల 11 అర్ధరాత్రి వ్యాపారి ఇంట్లో పని చేసే బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఇంకొకరి సహాయంతో మూడు రూముల లాక్స్ బ్రేక్ చేశాడు. ఇంట్లో ఉన్న రూ.50 లక్షల నగదు సహా 2 కోట్లు విలువ చేసే డైమండ్స్, గోల్డ్ ఎత్తుకెళ్లారు. నారాయణగూడ పోలీసులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.