Coins In Stomach: కర్ణాటకలో విచిత్ర వార్త వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడి కడుపునుంచి ఏకంగా 187నాణేలను ఆపరేషన్ చేసి డాక్టర్లు బయటకు తీశారు. మానసిక రోగి అయిన ఓ వృద్ధుడు తనకిచ్చే నాణేలను మింగేవాడు. అలా అతడు మొత్తం 187నాణేలు మింగాడు. ఇవన్నీ కడుపులో అలా ఉండిపోయాయి. చివరికి వాటి బరువు ఒకటిన్నర కేజీకి చేరుకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక , రాయచూర్ జిల్లా లింగసుగూర్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి దయమప్ప హరిజన్. పొత్తికడుపులో విపరీతంగా నొప్పిగా ఉందని ఆస్పత్రికి రావడంతో అతనికి ఎక్స్‌రే, ఎండోస్కోప్‌లు చేశారు. టెస్ట్‌లలో అతని కడుపులో నాణేలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అతడికి శస్త్రచికిత్స చేశారు. దీని గురించి వైద్యులు ఈశ్వర్ కల్బుర్గి మాట్లాడుతూ.. తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్న దయమప్ప హరిజన్‌ను బంధువులు హాస్పిటల్ కు తీసుకుని వచ్చారని చెప్పారు.

అతను కొద్ది నెలలుగా ఈ నొప్పితో బాధ పడుతున్నట్లు గుర్తించామన్నారు. రిపోర్టులు చూసి ఆశ్చర్యపోయామని, కడుపులో పెద్ద సంఖ్యలో నాణేలు ఉన్నాయని తెలిపారు. విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించి అతని కడుపు నుంచి నాణేలు తొలగించామన్నారు. ఎస్ నిజలింగప్ప మెడికల్ కాలేజీ, హనగల్ కుమారేశ్వర్ ఆసుపత్రికి చెందిన వైద్యుల బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ డాక్టర్ల బృందంలో డాక్టర్ ఈశ్వర్ కల్బుర్గి, డాక్టర్ ప్రకాష్ కట్టి మణితోపాటు అర్చన, రూపల్ హలకుండే అనే ఇద్దరు అనస్తీషియా డాక్టర్లు పాల్గొన్నారు. పొట్టలో నుంచి నాణేలను బయటకు తీసి అవి ఎంత ఉన్నాయో లెక్క పెట్టారు. ఆ నాణేలలో ఐదు రూపాయల నాణేలు 56, రెండు రూపాయల నాణేలు 51, రూపాయి నాణేలు 80 ఉన్నాయి. ఈ ఆపరేషన్ తర్వాత బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.