10 నెలల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తుల చర్చలు అసంపూర్తిగా ముగిసిన వేళ గాజాపై మరోసారి భీకర దాడులు జరిగాయి. జవైదా పట్టణంపై టెల్‌అవీవ్ జరిపిన వైమానిక దాడిలో 18 మంది మృతి చెందారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విశేషం. దాడిలో వ్యాపారి అయిన సమీ జవాద్ అల్-ఎజ్లా, అతడి ఇద్దరు భార్యలు, 11 మంది పిల్లలు, మరో నలుగురు బంధువులు ప్రాణాలు కోల్పోయినట్లు అల్-అక్సా ఆసుపత్రి తెలిపింది.
లెబనాన్‌లోని నాబాతీహ్ ప్రావిన్స్‌లో జరిపిన మరో దాడిలో ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హెజ్‌బొల్లాకు చెందిన ఆయుధ నిల్వ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. తీరప్రాంత టైర్ నగరంలో జరిపిన దాడిలో ఓ హెజ్‌బొల్లా కమాండర్‌ను హతమార్చినట్లు వెల్లడించారు. సెంట్రల్ గాజాలోని మాఘాజీ శరణార్థి శిబిరం, పరిసర ప్రాంతాల్లోని పాలస్తీనీయన్లు వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు.
యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్ మరియు ఖతార్ మధ్యవర్తులు ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరిగిన చర్చలలో పలు విషయాలను చర్చించారు. కైరోలో వచ్చే వారం మరోసారి సమావేశం కానున్నారు. విరమణ అమలు వివరాలను రూపొందించాలని భావిస్తున్నారు. గాజాలో దాడులను ఆపడమే లక్ష్యంగా మధ్యవర్తుల చర్చలు జరిపారు. ఇక్కడ మరణాల సంఖ్య 40,000 దాటింది.