Fire Accident: ఆఫ్రికా దేశంలోని ఉగాండాలో గల అంధుల బోర్డింగ్ పాఠశాలలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది బాలికలు సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు బాలికలు తీవ్రంగా గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉంది. ఉగాండా రాజధాని కంపాలాకు సమీపంలోని ముకునోలో ఈ విషాదం చోటుచేసుకుంది. అంధుల కోసం ఏర్పాటు చేసిన సలామా రెసిడెన్షియల్ పాఠశాల డార్మిటరీలో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో నిద్రిస్తున్న బాలికలు సజీవదహనమయ్యారు. బాలికల వయస్సు 7-10 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు. మంటల తీవ్రతకు బాలికలు మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని అధికారులు వెల్లడించారు. డీఎన్ఏ పరీక్షలు చేస్తే తప్ప మృతులను గుర్తించడం సాధ్యం కాదన్నారు.
Sitrang Cyclone: బంగ్లాదేశ్‌లో సిత్రాంగ్ తుఫాన్ బీభత్సం.. 35 మంది మృతి
బాలికల గదిలో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మంటలు చెలరేగిన గదిలో 21 మంది బాలికలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. పోలీసులు, సైనికులు పాఠశాలను తమ అధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉగాండా పర్యటనలో భాగంగా బ్రిటన్ యువరాణి యాన్ శుక్రవారం ఈ బడిని సందర్శించాల్సి ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. మంటలు ఆర్పేందుకు తమ వద్ద అవసరమైన సామగ్రి లేదని సలామా పాఠశాల నిర్వాహకుడు ఫ్రాన్సిస్ కిరుబే చెప్పారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదని వాపోయారు.