Police Station Robbery: ఎవరింట్లో అయినా దొంగలు పడితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. మరి ఆ పోలీస్‌స్టేషన్‌లోనే దొంగతనం జరిగితే ఆ పోలీసులు ఎవరికి ఫిర్యాదు చేయాలి?. అలాంటి ఘటన కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఇటీవల జరిగింది. ఏకంగా రూ.75లక్షల విలువైన వెండి ఆభరణాలు, నగదు మాయమైన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్నూల్ తాలూకా అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో రూ.75లక్షల విలువైన వెండి ఆభరణాలు, నగదు మాయమైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీరువాలో దాచిన 105 కిలోల వెండి, డబ్బు కనిపించకపోవడంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కొందరు సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఎవరు వాటిని దొంగిలించారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Read Also: Kanpur : కాన్ఫూర్ లోని అగ్ని ప్రమాదం.. 500 బట్టల దుకాణాల్లో మంటలు
ఏం జరిగిందంటే.. రెండేళ్ల క్రితం పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యాపారుల నుంచి 105 కిలోల వెండి ఆభరణాలు, రూ. 2 లక్షల 5 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఆభరణాలను, నగదును పోలీస్ స్టేషన్‌లో ఉన్న బీరువాలో దాచారు. ఇటీవల సదరు యజమానులు కోర్టు నుంచి అనుమతి పొంది పీఎస్‌కు చేరుకుని వెండి, నగదు అప్పగించాలని కోరారు. దాంతో సీఐ బీరువా తెరిచి చూడగా.. బీరువాలో వెండి, నగదు కనిపించలేదు. దీంతో సీఐ రామలింగయ్య నిర్ఘాంతపోయారు. వెండి, నగదు సీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు నలుగు సీఐలు బదిలీ అయ్యారు. దీంతో వారందరినీ పిలిపించి విచారించడం మొదలుపెట్టారు అధికారులు. స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.