పన్ను వ్యతిరేక నిరసనలతో కెన్యా రణరంగంగా మారింది. పార్లమెంట్ ముట్టడికి పెద్ద ఎత్తున ఆందోళనకారులు తరలిరావడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. పోలీసులు, భద్రతా సిబ్బంది నిరసనకారులపై టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులు, తుపాకీ కాల్పులకు పాల్పడ్డారు. దీంతో పరిస్థితులు భీతావాహంగా మారిపోయింది. నిరసనకారులు కూడా రాళ్లతో రెచ్చిపోవడంతో హింసాత్మకంగా మారిపోయింది. పోలీసులు కాల్పుల్లో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందగా.. వందలాది మంది గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇక నిరసనకారులు పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టడంతో మంటలు అంటుకుని కొంత భాగం తగలబడిపోయింది.
పన్నులను పెంచేందుకు కెన్యా ప్రభుత్వం బిల్లును తీసుకువచ్చింది. మంగళవారం ఆర్థిక బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు సంతకం చేస్తే అమల్లోకి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ అనేక నగరాల్లో నిరసనలకు పిలుపునివ్వగా.. పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అటు పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు వేలాదిమంది ఆందోళనకారులు ప్రయత్నించారు. బారికేడ్లను చొచ్చుకొని రావడంతో భద్రతా సిబ్బంది వారిని కట్టడి చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగంతో పాటు కాల్పులు జరిపారు. ఇక టియర్ గ్యాస్ ప్రయోగంతో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సోదరి గాయపడింది.