Cholera Outbreak: ఆఫ్రికా దేశం జాంబియాలో కలరా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 400 మందికి పైగా మరణించారు. మరో 10,000 మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలింది. కలరా భయంతో పాఠశాలల్ని మూసేసింది అక్కడి ప్రభుత్వం. సామూహిక టీకా కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తోంది. దేశ రాజధానిలో ఫుట్‌బాల్ స్టేడియంలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లను చేసింది.
Read Also: Heart Attack: విషాదం.. క్లాసు వింటూనే కుప్పకూలిన సివిల్ సర్వీసెస్ అభ్యర్థి..
కలరా అనేది బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్. ఇది తీవ్రమైన డయేరియాకు దారి తీస్తుంది. కలుషిత నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. జాంబియాలో కలరా వ్యాప్తి గతేడాది అక్టోబర్ నెలలో ప్రారంభమైంది. ఇప్పటి వరకు 412 మంది మరణించారు. 10,413 కేసులు నమోదయ్యాయి. దేశంలోని సగం జిల్లాలు, 10 ప్రావిన్సుల్లోని తొమ్మిదింటిలో కలరాను కనుగొన్నట్లు జాంబియన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో రోజుకు 400 కంటే ఎక్కువ కలరా కేసులు నమోదువుతున్నాయి.
మలావీ, మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో 2023 ప్రారంభం నుంచి కలరా కేసులు నమోదవుతున్నాయి. 2023లో దశాబ్దాలలో మలావిలో కలరా వ్యాప్తి అత్యంత దారుణంగా ఉంది. గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ.. నైజీరియా, ఉగాండా దేశాలతో సహా సుమారు 30 దేశాలు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన వ్యాప్తికి గురయ్యాయని నివేదించింది. 1970 నుంచి జాంబియాలో చాలా సార్లు కలరా వ్యాప్తి చెందింది. ఎక్కువ కేసులు రాజధాని లుసాకాలోనే ఉన్నాయి. 60,000 సీటింగ్ సామర్థ్యం ఉన్న ఫుట్‌బాట్ స్టేడియాన్ని తాత్కాలిక ఆస్పత్రిగా మార్చింది అక్కడి ప్రభుత్వం. డబ్ల్యూహెచ్ఓ నుంచి జాంబియాకు దాదాపుగా 1.4 మిలియన్ డోసుల కలరా వ్యాక్సిన్ అందింది. త్వరలోనే 2,00,000 డోసులు వస్తాయని అంచనా వేస్తున్నారు.