Yogi Adityanath: తమిళనాడు- కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో యూపీ యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలోని స్కూల్స్ లో తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ, మరాఠీ లాంటి భాషలను బోధిస్తున్నామని వెల్లడించారు. దీని వల్ల మా రాష్ట్రం ఏమైనా చిన్నదైపోతుందా?. అని ప్రశ్నించారు. మూడు భాషలు నేర్చుకోవడం వల్ల కొత్త ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలను సృష్టిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌పై ఆయన మండిపడ్డారు. స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే స్టాలిన్ త్రిభాషా విధానంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇది తమిళనాడు యువత ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బ తీస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.
Read Also: Hyderabad: హైదరాబాద్‌లో విదేశీ యువతిపై అత్యాచారం.. వెలుగులోకి సంచలన విషయాలు!
ఇక, యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం రియాక్ట్ అయ్యారు. యూపీలో తమిళంలో పాఠాలు చెప్పేందుకు ఎంత మంది టీచర్లు ఉన్నారనే వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఎక్స్ వేదికగా క్వశ్చన్ చేశారు. తమిళ భాషను నేర్చుకునేందుకు ఎంత మంది స్టూడెంట్స్ తమ పేర్లను నమోదు చేసుకున్నారనే వివరాలను కూడా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక, తమిళనాడు స్టూడెంట్స్ హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మన రాష్ట్రానికి వచ్చే కార్మికులు తమిళం నేర్చుకుని రారని.. మాపై హిందీని బలవంతంగా రుద్దాలనే మీ ఆలోచన ఆపేయాలని కార్తీ చిదంబరం మండిపడ్డారు.