CM Yogi: కులం, మతం, వర్గం ఆధారంగా జరిగే విభజనలు సంపూర్ణ వినాశనానికి కారణం అవుతాయని, బంగ్లాదేశ్ పరిస్థితులు తలెత్తుతాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రయాగ్ రాజ్‌లోని మాఘ మేళాలో కార్యక్రమంలో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘బంగ్లాదేశ్ ఘటనపై ఎవరూ మాట్లాడరు. లౌకివాదం పేరుతో దుకాణాలు నడుపుతున్న వ్యక్తులు హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తు్న్నారు. సనాతన ధర్మాన్ని విడదీయాలని అనుకుంటున్నారు. కానీ బంగ్లాదేశ్ సంఘటనల విషయానికి వస్తే వారి నోళ్లు ఫెవికాల్, టేప్‌తో మూతపడినట్లు ప్రవర్తిస్తున్నారు. బంగ్లాదేశ్ సంఘటనలపై కనీసం కొవ్వత్తుల ప్రదర్శన కూడా చేయలేదు. ఇది మనకు హెచ్చరిక’’ అని అన్నారు.
Read Also: Sankranti Celebrations : ఆత్రేయపురంలో నోరూరించే గోదావరి రుచులు.. సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్..!
సమాజాన్ని విభజించేవారు ప్రజలకు శ్రేయస్సును కోరుకోరని సీఎం హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు, ఈ వ్యక్తులు తమ కుటుంబాల కోసమే ఆలోచించారని, వారికి మళ్లీ అవకాశం వస్తే గతంలో చేసినట్లే చేస్తారని, వారు మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాలని, డబుల్-ఇంజన్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సనాతన విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి నిలబడుతుందని చెప్పారు. విభజనవాదులు మనల్ని బలహీనపరచడానికి అనుమతించొద్దని, మనందరం ఈ సంకల్పంతో ముందుకు సాగితే, భవిష్యత్తు సనాతన ధర్మానిదే అని అన్నారు. రామమందిరంపై జెండాలాగే, సనాతన జెండా ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడుతుందని, అప్పుడు బంగ్లాదేశ్‌లో బలహీనమైన, దళిత హిందువులను చంపడానికి ఎవరూ సాహసించరు అని యోగి అన్నారు.
సమాజాన్ని ఏకం చేయడానికి సాధువులు దారి చూపిస్తారని చెప్పారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం సాధువల ఐక్యత ఫలితమే అని అన్నారు. 1952 తర్వాత దేశానికి చాలా మంది ప్రధానులు వచ్చారు, కానీ అయోధ్యలో రామ్ లల్లా పున:ప్రతిష్టను ప్రధాని మోడీ చేసి చూపించారని అన్నారు.