Sonam Raghuvanshi Case: దేశవ్యాప్తంగా సోనమ్ రఘువంశీ కేసు సంచలనంగా మారింది. హనీమూన్‌కి తీసుకెళ్లిన భర్తని అతి దారుణంగా కిరాయి హంతకులతో చంపించింది. మే 23 నుంచి కనిపించకుండా పోయిన రాజా రఘువంశీ మృతదేహం జూన్ 02న మేఘాలయలోని కాసీ హిల్స్‌లో దొరికింది. పోలీసులు రాజాది హత్యగా తేల్చారు. మృతదేహం దొరికిన తర్వాత భార్య సోనమ్‌పై పోలీసులకు అనుమానం ఏర్పడింది. ఈ దిశగా దర్యాప్తు చేస్తుండగా, జూన్ 08న సోనమ్ ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ పోలీసులు ముందు లొంగిపోయింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి మర్డర్ ప్లాన్ చేసింది సోనమ్.
ఇదిలా ఉంటే, తానే తన భర్తను చంపించానని సోనమ్ పోలీసుల ముందు ఒప్పుకుంది. అయితే, కోర్టులు పోలీసుల ముందు ఒప్పుకునే ప్రకటనల్ని అంగీకరించవు. వాంగ్మూలానికి సరైన సాక్ష్యాధారాలను పోలీసులు కోర్టు ముందు సమర్పించాల్సి ఉంటుంది. హత్యకు కీలక సూత్రధారులైన సోనమ్, రాజ్ కుష్వాహాలతో పాటు ముగ్గురు హంతకులను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత సోనమ్ పోలీసుల ముందు తామే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది.