Karnataka Elections: కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయ పోరాటం ప్రారంభం అయింది. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్, మరోసారి అధికారం నిలుపుకునేందుకు బీజేపీ, కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు జేడీఎస్ ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నాయి. ఇదిలా ఉంటే కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధ రామయ్య తనకు ఇవే చివరి ఎన్నికలంటూ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేశారు.
Read Also: Philippine: ఫిలిప్పీన్స్ లో అగ్నిప్రమాదం.. 31 మంది దుర్మరణం
మరోవైపు బీజేపీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కీలక నేత యడియూరప్పపై ఆ పార్టీ ఉంచింది. సిద్ధరామయ్యను బీజేపీ నుంచి ఎవరు ఢీ కొంటారనే సందేహం కన్నడ ప్రజల్లో ఉంది. అయితే ఈ విషయమై యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు సిద్ధరామయ్యపై పోటీ చేయొచ్చని ఆయన అన్నారు. సిద్ధరామయ్య వరుణ, చాముండేశ్వరి నియోజకవర్గాల నుంచి ఎక్కువగా పోటీ చేశారు. 2018 ఎన్నికల్లో చాముండేశ్వరీ, బాదామి నుంచి పోటీ చేస్తే కేవలం బాదామి నుంచి 1600 ఓట్లతో గెలుపొందాడు. చాముండేశ్వరిలో దారుణంగా ఓడిపోయాడు. మరోవైపు వరుణ నుంచి ఆయన కుమారుడు యతీంద్ర ఎమ్మెల్యేగా ఉన్నారు.
అయితే ఈ సారి యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను వరుణ నుంచి పోటీలో ఉండాలా..? వద్దా..? అనే దానిపై ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. మే 10న కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఎన్నికలకు కేవలం ఒక నెల మాత్రమే సమయం ఉంది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన రిజర్వేషన్లు ఫలితంగా ఇటీవల యడియూరప్ప ఇంటిపై బంజారా వర్గం దాడులు చేశారు. లింగాయత్, ఇతర వర్గాలకు రిజర్వేషన్ కోటా పెంచారు. ముస్లింలకు ఆర్ధికంగా వెనబడిన వర్గాలలో రిజర్వేషన్లు కల్పించిందని యడియూరప్ప అన్నారు. 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ 70 స్థానాలకు మించి గెలవడని ఆయన చెప్పారు.