Woman writes Class 10 exam hours after giving birth to son: బీహార్ లో ఓ మహిళ చదువుకోవాలనుకుంటున్న వారికి స్పూర్తిగా నిలుస్తోంది. బిడ్డ పుట్టిన కొన్ని గంటల్లోనే 10వ తరగతి పరీక్షలకు హాజరైంది. ఈ ఘటన బుధవారం రోజు బీహార్ లోని బంకాలో చోటు చేసుకుంది. కొడుకు జన్మించిన తర్వాత మూడు గంటల్లోనే పరీక్షా కేంద్రానికి హాజరై ఎగ్జామ్ రాసింది. పరీక్ష రాయాలనే ఆమె సంకల్పాన్ని ప్రసవవేదన కూడా కదిలించలేకపోయింది. పురిటి నొప్పుల ముందు ఎగ్జామ్ రాయాలన్న ఆమె స్థైర్యాన్ని అంతా మెచ్చుకుంటున్నరు.
బంకా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న రుక్మిణి కుమారి(27) బుధవారం ఉదయం ఆరుగంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది. మూడు గంటల తర్వాత సైన్స్ పేపర్ రాయడానికి వెళ్లింది. ప్రస్తుతం ఈ విషయం ఆ పట్టణంలో చర్చనీయాంశం అయింది. మహిళా విద్యపై ప్రభుత్వం చూపుతున్న ప్రాధాన్యత దీంతో తెలుస్తోందని.. షెడ్యూల్డ్ కులానికి చెందిన రుక్మిణీ అందరికి స్పూర్తిదాయకంగా నిలిచారని జిల్లా విద్యాశాఖ అధికారి పవర్ కుమార్ అన్నారు.
Read Also: INDvsAUS 2nd Test: ఆదుకున్న అక్షర్, అశ్విన్.. టీమిండియా 262 ఆలౌట్
దీనిపై రుక్మిని మాట్లాడుతూ.. మంగళవారం గణితం పేపర్ రాసే సమయానికి కొంత అసౌకర్యం అనిపించిందని.. మరుసటి రోజు జరగాల్సిన సైన్స్ పేపర్ పై ఉత్కంఠగా ఉందని, అయితే సైన్స్ పేపర్ రాయాల్సిన రోజు ఉదయం 6 గంటలకు నా కొడుకు పట్టాడని ఆమె తెలిపింది. తనకు పుట్టిన కొడుకు పెద్దవాడై చదువుల్లో రాణించాలని ఆమె కోరుకుంది. రుక్మిణి పరీక్ష రాయడానికి ఆస్పత్రి సిబ్బంది సహాయం చేశారు.
ప్రసవం సమయంలో ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో పరీక్షను రాయొద్దని మేము కోరామని డాక్టర్ భోళా నాథ్ అన్నారు. దీనికి రుక్మిని ఒప్పించేందుకు ప్రయత్నించామని.. ఆమె మొండిగా ఉండటంతో ఏర్పాట్లు చేశామని, అత్యవసర పరిస్థితుల్లో ఆమెకు సహాయం చేయడానికి అంబులెన్స్, వైద్య సిబ్బందిని ఉంచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు.