Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ పాఠశాల అమానుషంగా వ్యవహరించింది. సామూహిక అత్యాచారానికి గురైన ఓ విద్యార్థినిని 12వ తరగతి పరీక్షలు రాసేందుకు అనుమతించలేదు. పరీక్షలకు హాజరయ్యేందుకు తనకు అడ్మిట్ కార్డ్ ఇవ్వలేదని సదరు బాలిక ఆరోపించింది. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో 12 తరగతి చదువుతున్న విద్యార్థిని గతేడాది సామూహిక అత్యాచారానికి గురైంది. అయితే, ఆమె పరీక్షలు రాసేందుకు వస్తే పాఠశాల వాతావరణం దెబ్బతింటుందని, అందుకే పరీక్షలు రాసేందుకు ఉపాధ్యాయులు అనుమతించలేదని బాధితురాలు చెబుతోంది. తన ఉనికి పాఠశాల వాతావరణాన్ని పాడుచేస్తుందని, ఇంట్లోనే చదువుకోవాలని ఉపాధ్యాయులు చెప్పినట్లు బాలిక ఆరోపించింది.
Read Also: UPI New Feature: ‘యూపీఐ’ లో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టబోతున్న ఆర్బిఐ..!
ప్రస్తుతం పాఠశాలపై చర్యలు తీసుకునేందుకు చైల్డ్ వెల్ఫేర్ బోర్డు సిద్ధమవుతోంది. బాధితురాలిని బోర్డు సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై బాలిక చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి లేఖ రాయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల క్రితం తాను బోర్డు పరీక్షలకు హాజరయ్యానని, పరీక్షకు హాజరు కావడానికి పాఠశాల అడ్మిట్ కార్డు ఇవ్వలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ అంజలీ శర్మ చెప్పారు. విద్యార్థుల జాబితాను నుంచి బాలిక పేరును తొలగించినట్లు తెలిపింది. మరోవైపు, విద్యార్థిని 4 నెలలు తరగతులకు హాజరుకాకపోవడం వల్లే అడ్మిట్ కార్డ్ ఇవ్వలేదని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం చెబుతోంది.
గతేడాది అక్టోబర్‌లో విద్యార్థినిపై ఆమె మామ, మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె హాజరుకావడాన్ని ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆమెను పాఠశాలకు రానీయకుండా అడ్డుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. 10వ తరగతి బోర్డు పరీక్షల్లో సదరు బాలిక 79 శాతం మార్కుల్ని సాధించింది. అయితే, ప్రస్తుతం పాఠశాల నిర్లక్ష్యం వల్ల 12వ తరగతి పరీక్షలకు హాజరుకానీయకుండా చేయడంతో ఒక ఏడాది నష్టపోవచ్చని అంజలీ శర్మ చెప్పారు.