India-Europe trade deal: ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’గా చెప్పబడుతున్న ఇండియా-యూరోపియన్ యూనియన్ (EU) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) అమెరికాతో పాటు పాకిస్తాన్‌కు కూడా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా, ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న దాయాది దేశానికి ఈ ఒప్పందం మరింత ఆందోళనలను, భయాన్ని కలిగిస్తోంది. పాక్ నుంచి యూరప్‌కు ఎక్కువగా వస్త్రాలు, దుస్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ డీల్‌తో పాకిస్తాన్ వ్యాపారానికి భారత్ గండికొడుతుంది.
యూరోపియన్ యూనియన్ పాకిస్తాన్‌కు రెండో అతిపెద్ద ఎగుమతి మార్కెట్. దాని వార్షిక ఎగుమతుల్లో 9 బిలియన్ డాలర్లు( రూ. 8.25 లక్షల కోట్లు) ఉన్నాయి. ఇప్పుడు ఇది ప్రమాదంలో పడింది. భారత్‌తో వాణిజ్య ఒప్పందం తర్వాత తమ ఎగుమతులపై ప్రభావం పడకుండా ఈయూతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. భారత్-ఈయూ మధ్య డీల్ ఒకే కావడంతో పాక్ ప్రభుత్వం కంగారులో పడింది. పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్‌తో మంత్రులు సమావేశమయ్యారు. దీనికి ముందు పాక్ ప్రధాని, ఈయూ రాయబారి మధ్య సమావేశం జరిగింది.
పాక్ భయాలకు కారణం ఇదే..
భారత్-ఈయూ డీల్‌తో పాక్ ఎగుమతులు ప్రశ్నార్థకంగా మారుతాయి. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, పాక్ ఎగుమతి వాటా 1990లో జీడీపీలో 16 శాతం ఉంటే, ఇది 2024లో దాదాపు 10 శాతానికి పడిపోయింది. మరోవైపు, ఈయూ పాకిస్తాన్‌కు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్లస్ (GSP+) హోదా ఇచ్చింది. దీని ద్వారా పాక్ 66 శాతం ఎగుమతులు ఎలాంటి సుంకాలు లేకుండా ఈయూ మార్కెట్‌లోకి వెళ్తున్నాయి. దీని కారణంగా పాకిస్తాన్ యూరప్‌కు వస్త్ర ఎగుమతులు 108 శాతం పెరిగాయి. పాక్ ఇచ్చిన ఈ హోదా వచ్చే ఏడాదితో ముగుస్తోంది. ఇది పాక్‌లో మరింత భయాన్ని పెంచుతుంది. పాక్ పారిశ్రామిక ఉత్పత్తుల్లో వస్త్రరంగం అతిపెద్దది. ఈ రంగం 15 నుంచి 25 మిలియన్ల మందికి ఉపాధి ఇస్తుంది.
భారత్‌కు ప్రయోజనం:
భారత్ వస్త్ర ఎగుమతులు ప్రస్తుతం ఈయూ మార్కెట్‌లో 12 శాతం సుంకాలను ఎదుర్కొంటున్నాయి. వాణిజ్య ఒప్పందం కుదిరితే వెంటనే భారతీయ వస్త్ర ఎగుమతులపై జీరో సుంకాలు అమలవుతాయి. భారత్ నుంచి ఈయూకు వెళ్లే దాదాపు 99 శాతం ఉత్పత్తులకు ఎలాంటి సుంకాలు ఉండవు. ఈయూ నుంచి వచ్చే 97 శాతం సరకులకు సుంకాలు ఉండవు.
ట్రంప్ సుంకాలతో దెబ్బతిన్న దుస్తులు, రత్నాలు, ఆభరణాలు, ఫుట్‌వేర్ ఇండస్ట్రీలు ఈ డీల్‌తో మళ్లీ పుంజుకోనున్నాయి. భారత్ ఎగుమతులతో యూరప్ మార్కెట్ నిండిపోతే, పాకిస్తాన్‌కు ఇబ్బందులు తప్పవు. ఇది బంగ్లాదేశ్ విషయంలో కూడా వర్తిస్తుంది.
పాక్‌పై తీవ్ర ప్రభావం:
ఈయూతో ట్రేడ్ డీల్‌తో ఇప్పుడు మొత్తం పరిస్థితి మారుతుంది. భారత ఉత్పత్తులు ఈయూ మార్కెట్‌లో గణనీయమైన పోటీని ఇస్త్తాయి. ఈయూ తన వాణిజ్యాన్ని అమెరికా, చైనాలను దాటి వైవిధ్యపరచాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు GSP+ హోదా పొడిగిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. పాక్ మాజీ వాణిజ్య మంత్రి డాక్టర్ గోహర్ ఎజాజ్ మాట్లాడుతూ.. ఈయూ మార్కెట్‌లో పాకిస్తాన్ ఉన్న ‘‘జీరో టారిఫ్ హనీమూన్’’ ముగిసిందని అన్నారు. దాదాపుగా 1 కోటి ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరించారు. పరిస్థితిని గమనించిన పాకిస్తాన్ ప్రభుత్వం పరిశ్రమలకు విద్యుత్ ధరల్ని తగ్గించే చర్యల్ని ప్రారంభించింది. పారిశ్రామిక వినియోగదారుల కోసం యూనిట్ రూ. 4.04 మేర విద్యుత్ ధర తగ్గించింది.