Atul Subhash Suicide Case: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్య నిఖితా సింఘానియా, అత్తమామలు పెట్టే వేధింపులను 24 పేజీల్లో వివరించాడు. చనిపోయే ముందు గంటకు పైగా వీడియోని రికార్డ్ చేశాడు. అందులో తన ఆవేదన, తాను ఎదుర్కొన్న తప్పుడు కేసులను గురించి చెప్పాడు. తనపై అన్యాయంగా వరకట్న వేధింపులు, గృహహింస కేసులు పెట్టినట్లు భార్య నికితపై ఆరోపించారు. విడాకుల సెటిల్మెంట్ కోసం రూ. 3 కోట్లు ఇవ్వాలని తనను వేధించినట్లు సుభాష్ పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో నిఖితా సింఘానియాతో పాటు ఆమె తల్లి, సోదరుడుని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వీరికి బెయిల్ లభించింది.
Read Also: Roja: అల్లు అర్జున్ పేరు లాగుతూ పవన్ కళ్యాణ్ పై రోజా విమర్శలు
ఇదిలా ఉంటే, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ని రద్దు చేయాలని నిఖితా సింఘానియా అభ్యర్థనని కర్ణాటక హైకోర్టు సోమవారం తోసిపుచ్చింది. జస్టిస్ ఎస్ ఆర్ కృష్ణ కుమార్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ మౌఖికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నిఖితా సింఘానియా డిమాండ్‌ని ధర్మాసనం వ్యతిరేకించింది. ‘‘ ఈ నేరం యొక్క ప్రాథమిక అంశాలు ఫిర్యాదులో ఉన్నాయి. విచారణ జరగాలని మీరు ఎందుకు కోరుకోరు..?’’ అని ధర్మాసనం సింఘానియాని ప్రశ్నించింది. నిఖితా తరుపు లాయర్ మాట్లాడుతూ.. ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎలాంటి చర్యలను ఎఫ్ఐఆర్ ప్రస్తావించలేదని హైకోర్టుకు చెప్పారు. పిటిషనర్‌కి చట్టపరమైన పరిష్కారాలు పొందే హక్కు ఉందని, అతుల్ సుభాష్ ఫిర్యాదు చేసినంత మాత్రాన కేసు బుక్ చేయలేని వాదించాడు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం అభ్యంతరాలను దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా సేకరించిన మెటీరియల్‌లను సమర్పించాలని ప్రాసిక్యూషన్‌కు ఆదేశాలు కూడా ఇచ్చారు.