Bishnoi community: ఎన్సీపీ నేత, మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్ధిఖి హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సల్మాన్ ఖాన్‌కి అత్యంత ఆప్తుడు, మిత్రుడిగా ఉన్న సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చిచంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అయితే, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అసలు సల్మాన్ ఖాన్‌కి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు..? దీనికి కారణం, 1998లో ‘‘హమ్ సాథ్ సాథ్ హై’’ సినిమా షూటింగ్ కోసం జోధ్‌పూర్ వెళ్లిన సమయంలో.. సల్మాన్ ఖాన్ రెండు కృష్ణ జింకల్ని వేటాడి చంపేశాడు. అప్పటి నుంచి బిష్ణోయ్ తెగకు సల్మాన్ ఖాన్‌కి మధ్య యుద్ధమే నడుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో 5 ఏళ్ల వయసు ఉన్న లారెన్స్ బిష్ణోయ్, ఇప్పుడు ఏకంగా గ్యాంగ్ స్టర్‌గా మారి సల్మాన్ ఖాన్‌ని చంపేస్తానని హెచ్చరిస్తున్నాడు.
Read Also: Salman Khan Y Plus Security: సల్మాన్ ఖాన్ Y+ సెక్యూరిటీకి మించి.. అష్టదిగ్బంధనమే!
బిష్ణోయిలు-కృష్ణజింకలకు మధ్య ఎనలేని ప్రేమ:
బిష్ణోయిలు ప్రధానంగా ప్రకృతితో మమేకమై జీవితాన్ని సాగిస్తుంటారు. వన్యప్రాణులు, వృక్షాలను సంరక్షిస్తుంటారు. బిష్ణోయిలకు-కృష్ణజింకలది ఇనాటి సంబంధం కాదు. గత 550 ఏళ్లనాటి బంధం. 15 శతాబ్ధంలో గురు జంభేశ్వర్(జంబాజీ) బిష్ణోయ్ కమ్యూనిటీని స్థాపించారు. 29 సూత్రాల ఆధారంగా ఈ తెగ ఏర్పడింది. అతని బోధనలు వన్యప్రాణులు, వృక్ష సంపద సంరక్షణను హైలెట్ చేస్తాయి. బిష్ణోయిలు కృష్ణజింకల్ని తమ ఆధ్యాత్మిక గురువు జంభేశ్వరుడి పునర్జమ్మగా గౌరవిస్తారు. తప్పిపోయిన కృష్ణజింకల్ని, బిష్ణోయి మహిళలు సొంత పిల్లల్లాగే పెంచుతారు. ఇవి కూడా భయం లేకుండా వారి మధ్యే తిరుగుతుంటాయి. మరణించిన తర్వాత బిష్ణోయిలు కృష్ణజింకలుగా పుడుతారనే నమ్మకం వారిది.
చివరకు చెట్లను కాపాడేందుకు కూడా ప్రాణాలు లెక్క చేయని తెగువ బిష్ణోయిలది. 1790లో జోధ్‌పూర్ సమీపంలోని ఖేజర్లీ గ్రామంలో చెట్లను నరకకుండా కాపాడుకునే క్రమంలో 362 మంది బిష్ణోయిలు చంపబడ్డారు. జోధ్‌పూర్ మహారాజా అభయ్ సింగ్ ఆదేశాల మేరకు ఈ హత్యాకాండ జరిగింది. రాజు కొత్త రాజభవనానికి కలప అవసరం కాగా, చెట్లను నరికివేసేందుకు వచ్చిన వారిని అమృతాదేవీ అనే మహిళ నేతృత్వంలో బిష్ణోయిలు అడ్డుకున్నారు. చెట్లను నరకకుండా కౌగిలించుకున్నారు. ఇప్పటికీ బిష్ణోయి మహిళలు కృష్ణ జింకలకు తమ పాలను ఇస్తుంటారు. అంతలా వీరి మధ్య బంధం ఉంది.