Atiq Ahmed: అతిక్ అహ్మద్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. గ్యాంగ్ స్టర్, మాఫియాడాన్, మాజీ ఎంపీ అయిన అతీక్ అహ్మద్ ను ముగ్గురు దుండగులు అతి సమీపం నుంచి కాల్చి చంపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘ మాఫియాను మట్టిలో కలిపేస్తా’ అని అన్నంత పనిచేశాడని అనుకుంటున్నారు సాధారణ ప్రజానీకం. అయితే ఎలాగూ జీవితఖైదు శిక్ష పడిన వ్యక్తిని, మరో హత్య కేసు ట్రయల్స్ జరుగున్న వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చిందనేది ఇక్కడ ప్రశ్నగా ఉంది. అయితే ఈ హత్య పోలీసులు చేసిన ఎన్కౌంటర్ కాదు. అతడిని చంపాల్సిన ఎవరికి ఉందనే అనుమానాలు వస్తున్నాయి.
ఐఎస్ఐ పనేనా..?
ఇటీవల అతీక్ అహ్మద్ తనకు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ నుంచి ఆయుధాలు వచ్చేవని చెప్పాడు. అతీక్ అహ్మద్ నుంచి పలు దర్యాప్తు ఎజెన్సీలు మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది. నిజానికి ఆ దిశగా ఆలోచిస్తే ఈ హత్యతో ప్రభుత్వానికి సంబంధం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే అతడు బతికి ఉంటే, పలువురు రాజకీయ నాయకుల పేర్లు బయటకి వస్తాయనే భయంతోనే చంపించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణ నేరాలకు పాల్పడే ముగ్గురు వ్యక్తులు, ఓ టర్కీ తుపాకీ అదికూడా భారత్ లో నిషేధంలో ఉన్న ఆయుధాన్ని ఎలా పొందారు, అంత దగ్గర వరకు ఎలా రాగలిగారనేది అసలు ప్రశ్నలు.
10 వేల కోట్ల మాఫియా సామ్రాజ్యాన్ని స్థాపించిన అతీక్ అహ్మద్ గతంలో సమాజ్ వాదీ పార్టీ, అప్నాదళ్ పార్టీల్లో పనిచేశారు. యూపీలోని పలు పార్టీలో సంబంధాలు ఉన్నాయి. దీంతో పాటు పాకిస్తాన్ గూఢాచర సంస్థ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబాతో సంబంధాలు ఉన్నట్లు సాక్షాత్తు అతనే ఒప్పుకున్నాడు. దీంతో పాటు హవాలా వ్యాపారాలు, అరబ్ కంట్రీల్లో అతీక్ అహ్మద్ తో పాటు అతని తమ్మడు అష్రఫ్ లకు ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లింకులు బయటపడితే పలువురు రాజకీయ నాయకులు రాజకీయ భవిష్యత్తు ముగుస్తుందనే భయంతోనే హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: Rishi Sunak: రిషి సునాక్ పై పార్లమెంటరీ విచారణ.. కారణం ఇదే..
యోగికి అపఖ్యాతి.. పెట్టుబడులకు దెబ్బ..
ఇక్కడ మరో అంశం ఏంటంటే యూపీని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నారు సీఎం యోగి. ఈ సమయంలో ఈ హత్యలు జరగడం యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బే. ఎందుకంటే పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. మాఫియా డాన్లు, నేరస్తులను ప్రభుత్వం ఎలిమినేట్ చేస్తుందంటే శాంతి భద్రతలకు పెద్ద పీట వస్తుందనే అర్థం వస్తుంది. అలాంటిది 17 మంది పోలీసులు రక్షణ ఉన్న వ్యక్తిని అత్యంత సమీపం నుంచి కాల్చి చంపితే, అక్కడ శాంతిభద్రతలు ప్రమాదంలో పడిన పరిస్తితి కనిపిస్తుంది. ఇలాంటి భయాలు పెట్టుబడిదారుల్లో ఉండే అవకాశం ఉంది.
చంపుతారని మొత్తుకుంటూనే ఉన్నాడు..
యూపీ సీఎం దెబ్బకు గుజరాత్ లోని ఓ కేసులో లొంగిపోయిన అతిక్ అహ్మద్ అక్కడి సబర్మతి జైలులోనే శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే తనను చంపేస్తారని మొత్తుకుంటూనే ఉన్నాడు. కానీ అతడి వాదనల్ని ఎవరు పట్టించుకోలేదు. యూపీ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారనే భయం కావచ్చని అనుకున్నారు. ఇతడితో పాటు అష్రఫ్ కూడా తను ఇంకో రెండు వారాల్లో హత్య చేస్తారని వ్యాఖ్యానించారు. వీరిద్దరి హత్యలు ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ఈ హత్యలకు పాల్పడిన లవ్లేష్ తివారీ, అరుణ్ మౌర్య, సన్నీలు చిన్నచితక నేరాలు చేసేవారు. వీరికి తుపాకీకి డబ్బులు, ఇతర సదుపాయాలు, ప్లాన్ ఎవరిచ్చారు, కేసును తప్పుదారి పట్టించేందుకే అతీక్ ను చంపి జైశ్రీరాం నినాదాలు చేశారా..? అనేదానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.