PM Modi: గత పదేళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేసిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమే అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మూడో సారి గెలిచిన తర్వాత అసలైన అభివృద్ధి చేసి చూపిస్తామని, హామీలను నెరవేరుస్తామని ఆయన అన్నారు. గురువారం బీహార్ రాష్ట్రంలోని జముయ్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. బీజేపీ, ఎన్డీయేలకు అనుకూల పవనాలు బీహార్‌లో మాత్రమే కాదని, దేశంలో మారుమూల అంతా వినిపిస్తున్నాయని ప్రధాని చెప్పారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమే అని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఆయన చెప్పారు.
Read Also: Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. బీజేపీలో చేరిన గౌరవ్ వల్లభ్
ప్రతిపక్ష ఇండియా కూటమిపై విమర్శలు గుప్పిస్తూ.. రైల్వేలో పేదలకు ఉద్యోగాలు ఇపిస్తానమని భూముల్ని కాజేసే వారు బీహార్ ప్రజలకు ఎప్పటికీ మేలు చేయలేరని మండిపడ్డారు. ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో వందేభారత్ వంటి అధునాతన రైళ్లు తిరుగుతున్నాయని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రపంచ దృష్టిలో భారత్ బలహీన దేశంగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచ నాయకుడిగా ఎదిగిందని మోడీ అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ పాలనలో దేశ ప్రతిష్ట మసకబారిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో భారతదేశాన్ని బలహీన, పేద దేశంగా భావించారు. ఈ రోజు ప్రపంచానికి భారత్ దారి చూపించే స్థితికి ఎదిగిందని చెప్పారు.
భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలు మాజీ సీఎం, భారతరత్న కర్పూరీ ఠాకూర్‌తో సహా రాష్ట్ర ప్రముఖుల్ని అవమానించాయని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా హయాంలో 500 ఏళ్ల రామమందిర కల నెరవేరిందని, రామ మందిర నిర్మాణాన్ని ఆపేందుకు కాంగ్రెస్, ఆర్జేడీలు ప్రయత్నించాయని మోడీ ఆరోపించారు.