Indian forces: భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హోం మంత్రిత్వ శాఖ కింద వివిధ రకాల పారామిలిటరీ దళాలు ఉంటాయి. అస్సాం రైఫిల్స్ (AR), సరిహద్దు భద్రతా దళం (BSF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమా బల్ (SSB) దళాలు సరిహద్దు రక్షణ దళాలుగా పనిచేస్తాయి. ఇవి మనదేశంలోని సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తాయి. వీటిలో పాటు సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF), నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(NSG), సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్(CRPF) హోం శాఖ కింద పనిచేస్తాయి.
సరిహద్దు భద్రతా దళం (BSF):
మనదేశానికి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. మొత్తం 15000 కి.మీ సరిహద్దుని కలిగి ఉంది. ప్రధానంగా, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) భారత సరిహద్దును కాపాడే ప్రాథమిక దళం. ఇది జమ్మూ కావ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లో విస్తరించి ఉన్న భారత్-పాక్ సరిహద్దులో దాదాపుగా 3323 కి.మీ లను సురక్షితంగా ఉంచుతుంది.
స్మగ్లింగ్, చొరబాటు, అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా వంటి సరిహద్దు నేరాలను నిరోధిస్తుంది. ‘‘శాంతి’’ సమయంలో బీఎస్ఎఫ్ హోంమంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. యుద్ధం జరిగినప్పుడు, భారత సైన్యం వెనక నిలుస్తుంది. భారత సైన్యంతో సమన్వయంతో పనిచేస్తుంది. యుద్ధ సమయంలో భారత మిలిటరీ నియంత్రణ రేఖ (LoC), అంతర్జాతీయ సరిహద్దు (IB) కంట్రోల్ తీసుకుంటుంది. బీఎస్ఎఫ్ వీరికి సహాయపడుతుంది. బీఎస్ఎఫ్ భారత్-బంగ్లా సరిహద్దులను కూడా పర్యవేక్షిస్తుంది.
ఇతర సరిహద్దు దళాలు:
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) భారత్-చైనా సరిహద్దుల్లో పనిచేస్తుంది. సశస్త్ర సీమా బల్ (SSB) నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో పనిచేస్తుంటుంది. అస్సాం రైఫిల్స్ పాలనాపరంగా హోం మంత్రిత్వ శాఖ కింద ఉన్నప్పటికీ, రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా నియంత్రించబడుతుంది. ఇది భారత్-మయన్మార్ సరిహద్దుల్లో గస్తీ నిర్వహిస్తుంది.
ప్రతీ దళం కూడా సరిహద్దుల్లోని భౌగోళిక, వాతావరణ, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ పొందుతుంది. ఉదాహరణకు, ఐటీబీపీ ఎత్తైన హిమాలయాల పరిస్థితుల్లో మోహరించబడుతుంది. దీనికి అనుగుణంగానే వీరికి శిక్షణ ఉంటుంది. బీఎస్ఎఫ్ నదులు, ఎడారులు, మైదాన ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించేలా శిక్షణ ఉంటుంది. అస్సాం రైఫిల్స్ దట్టమైన అరణ్యాలు, కొండ ప్రాంతాల్లో వార్‌ఫేర్ శిక్షణ కలిగి ఉంటుంది.
ఇక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్(CISF) దేశంలోని కీలకమైన పరిశ్రమలు, మౌలిక సదుపాయాలను రక్షిస్తుంటుంది. విమానాశ్రయాలు, మెట్రో వ్యవస్థ, అణు-విద్యుత్ ప్లాంట్లు, ఇస్రో వంటి అంతరిక్ష కేంద్రాలు, ఉక్కు కర్మాగారాల వద్ద భద్రతను నిర్వహిస్తుంటుంది. సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్(CRPF) ఆందోళనలు, అల్లర్లు, మత కలహాలు నిరోధించడంతో పాటు ఎన్నికల సమయంలో విధులు నిర్వహిస్తుంటుంది.