Manoj Naravane: భారతదేశం, విజయవంతంగా పాకిస్తాన్‌పై దాడులు చేస్తున్న సమయంలో కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకుందని, మరికొన్ని రోజులు పాటు యుద్ధం చేసి పీఓకేని స్వాధీనం చేసుకుంటే బాగుండేదని దేశంలోని పలువురు అనుకుంటున్నారు. మరికొంత మంది బంగ్లాదేశ్ ఏర్పాటు చేసినట్లు బెలూచిస్తాన్‌ని కూడా ఏర్పాటు చేస్తే బాగుండేదని వాదిస్తున్నారు. కొందరు యుద్ధం ఆగిపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరావణే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆదేశిస్తే యుద్ధానికి వెళ్తానని, కానీ దౌత్యమే తన మొదటి ఎంపిక అని అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు కాల్పులు, దాడుల వల్ల సురక్షిత ప్రాంతాలకు పరిగెత్తాల్సి వచ్చిందని, చాలా మంది పిల్లలు కూడా గాయపడ్డారని ఆయన చెప్పారు.
Read Also: India Pakistan Tension: భారత్ “బ్రహ్మోస్”తో భీకర దాడి.. పాక్ అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్.?
‘‘తమ ప్రియమైన వారిని కొల్పోయిన వారికి, ఆ బాధ తరతరాలు కొనసాగుతుంది. PTSD (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్) అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ భయంకరమైన దృశ్యాలు చూసిన వ్యక్తుల్లో 20 ఏళ్ల తర్వాత కూడా భయపడుతూ మేల్కుంటారు. వీరికి మానసిక సంరక్షణ అవసరం’’ అని ఆయన అన్నారు.
‘‘ యుద్ధం అంటే రొమాంటిక్ కాదు. ఇది మీ బాలీవుడ్ సినిమా కాదు. ఇది చాలా తీవ్రమైంది. యుద్ధం లేదా హింస మనం ఆశ్రయించాల్సిన చివరి అంశం. అందుకే మన ప్రధాని మోడీ ఇది యుద్ధాలు చేసుకునే కాలం కాదని అన్నారు. తెలివితక్కువ వ్యక్తులు యుద్ధాన్ని మనపై బలవంతంగా రుద్దినప్పటికీ, మనం దాని కోసం ఉత్సాహంగా ఉండొద్దు’’ అని ఆయన అన్నారు.