Waqf Act: ఈ రోజు నుంచి వక్ఫ్ సవరణ చట్టం-2025 అమలులోకి వచ్చింది. గత వారం పార్లమెంట్ వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు (ఏప్రిల్ 8, 2025) నుంచి అమలులోకి వచ్చినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. సవరించిన చట్టంలోని వివాదాస్పద నిబంధనలలో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులలో ఇద్దరు ముస్లిమేతర సభ్యులను తప్పనిసరిగా నియమించాలి. కనీసం 5 ఏళ్లు ఇస్లాంని ఆచరించిన వ్యక్తులు మాత్రమే వక్ఫ్‌కి ఆస్తులు విరాళంగా ప్రకటించే నిబంధనలు పొందుపరిచారు. ఒక ఆస్తిపై వివాదం ఏర్పడితే, అది వక్ఫ్ ప్రాపర్టీ అవునా..? కాదా..? అనేది ప్రభుత్వాధికారి నిర్ణయిస్తారు.
Read Also: Rahul Gandhi: ‘‘భారత రాజ్యాంగం 1000 ఏళ్ల పాతది’’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు..
ఇదిలా ఉంటే, వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 15 పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్, ఎంఐఎం, ఆర్జేడీ, ఆప్, డీఎంకే పార్టీల నేతలు ఈ పిటిషన్లను దాఖలు చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంపీఎల్బీ) కూడా పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు, ఈ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకునే దాకా నిరసన చేపడుతామని ముస్లిం లా బోర్డు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏప్రిల్ 16న దీనిపై విచారణ చేపట్టబోతోంది. అయితే, ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది, దీంట్లో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయరాదని పేర్కొంది.