Vodafone Idea AGR dues : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియాను గట్టెక్కించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్, కంపెనీ చెల్లించాల్సిన సుమారు రూ. 87,695 కోట్ల సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (AGR) బాకీల విషయంలో ఊరట ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా కంపెనీ తన బాకీలను చెల్లించే విషయంలో ఐదేళ్ల పాటు మారటోరియం విధిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
అంటే, ఈ భారీ మొత్తాన్ని వోడాఫోన్ ఐడియా తక్షణమే చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నిధులను ఫ్రీజ్ చేయడమే కాకుండా, వీటి చెల్లింపు గడువును 2031-32 ఆర్థిక సంవత్సరం నుండి 2040-41 వరకు, అంటే పదేళ్ల పాటు వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నిర్ణయం వల్ల కంపెనీకి తక్షణమే నగదు లభ్యత పెరగడంతో పాటు, నెట్వర్క్ విస్తరణ , 5G సేవలపై పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లభిస్తుంది.
Konaseema District: ఏపీలో శివలింగం ధ్వంసం కేసులో సంచలన విషయాలు.. నిందితుడు ఎవరంటే..?
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశ టెలికాం రంగం కేవలం రెండు ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్యంలోకి వెళ్లకుండా ఉండాలంటే, మూడో ప్రధాన సంస్థగా వోడాఫోన్ ఐడియా మనుగడ సాగించడం అత్యవసరం. ఒకవేళ ఈ కంపెనీ దివాలా తీస్తే, అందులో దాదాపు 49 శాతం వాటా కలిగిన ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లడమే కాకుండా, సుమారు 20 కోట్ల మంది వినియోగదారులు ఇబ్బందులు పడతారని కేంద్రం భావించింది. అందుకే, ఈ ఐదేళ్ల మారటోరియం కాలంలో పెండింగ్ బాకీలపై ఎటువంటి అదనపు వడ్డీని కూడా వసూలు చేయకూడదని నిర్ణయించడం విశేషం.
దీనివల్ల కంపెనీకి సుమారు రూ. 18,000 కోట్ల వరకు వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంది. అయితే, ఈ ఫ్రీజ్ చేసిన మొత్తాన్ని టెలికాం శాఖ మరోసారి క్షుణ్ణంగా ఆడిట్ చేసి సమీక్షిస్తుందని, తుది లెక్కలు కమిటీ నివేదిక ఆధారంగా ఖరారు అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం మీద ఈ భారీ ప్యాకేజీ వోడాఫోన్ ఐడియాకు ఊపిరి పోయడమే కాకుండా, టెలికాం రంగంలో ఆరోగ్యకరమైన పోటీని నిలబెట్టడానికి దోహదపడనుంది.
Hyundai Creta Sales 2025: ఈ ఏడాది అమ్మకాల్లో హ్యుందాయ్ క్రేటా సంచలనం.. గంటకు 23 కార్లు విక్రయం..!