Varun Gandhi: బీజేపీ నేత వరుణ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతోంది. తమ పార్టీలో చేరాలని సూచిస్తోంది. ఇటీవల బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల 5వ జాబితాలో వరుణ్ గాంధీని తప్పించింది. ఉత్తర్ ప్రదేశ్ పిలిభిత్ ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీని కాదని, ఆ స్థానాన్ని మాజీ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాదకు కేటాయింది. గత కొంత కాలంగా వరుణ్ గాంధీకి ఈ సారి ఎంపీ టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం నేపథ్యంలో బీజేపీ అన్నంత పనిచేసింది. అయితే, ఆయన తల్లి మేనకాగాంధీని సుల్తాన్ పూర్ నుంచి బీజేపీ బరిలోకి దించింది.
Real Also: US: అమెరికాలో ఘోర ప్రమాదం.. కంటైనర్ షిప్ ఢీకొని కూలిన బ్రిడ్జి
కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి, వరుణ్ గాంధీని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. గాంధీ కుటుంబంతో సంబంధం ఉందనే కారణంగానే ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వలేదని అధీర్ ఆరోపించారు. ‘‘ అతను (వరుణ్ గాంధీ) కాంగ్రెస్‌లో చేరాలి. అతను చేరితే మేము సంతోషిస్తాము. అతను బాగా చదువుకున్న రాజకీయ నాయకుడు. మంచి ఇమేజ్ ఉన్న నాయకుడు. గాంధీ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి. దీని కారణంగానే బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరాలని మేము కోరుకుంటున్నాము’’ అని అధీర్ అన్నారు.
అయితే, ఒక వేళ బీజేపీ టికెట్ నిరాకరిస్తే ఇండిపెండెంట్‌గా బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తన సహచరుల ద్వారా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు, పిలిభిత్‌లో ప్రచారం కోసం వాహనాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై వరుణ్ గాంధీ శిబిరం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం రాలేదు. గతంలో యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై పలు సందర్భాల్లో విమర్శలు చేసిన వరుణ్ గాంధీ, బీజేపీతో చాలా అంశాల్లో విభేదిస్తున్నారు.